ఎరువుల బుకింగ్ పై విస్తృత అవగాహన కల్పించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

ఎరువుల బుకింగ్ పై  విస్తృత అవగాహన కల్పించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
  • కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: ఎరువుల బుకింగ్ యాప్ వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యూరియా యాప్ వినియోగంపై శనివారం కలెక్టరేట్​లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు సులభంగా యూరియా పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. 

ఈ యాప్ ద్వారా రైతులు సులభంగా యూరియా పొందగలుగుతారని, ఈ యాప్​పై ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని సూచించారు. యూరియా ఎక్కడ, ఎంత మొత్తంలో అందుబాటులో ఉందో ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. యూరియా, ఎరువుల వాడకంపై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలన్నారు. అధిక మోతాదులో యూరియా వల్ల కలిగే నష్టాలను రైతులకు  వివరించాలన్నారు. 

ఆయిల్​ పామ్​ సాగు విస్తీర్ణాన్ని పెంచాలి

జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ పంటల సాగు వల్ల పొందే ఆర్థిక లాభాలను రైతులకు వివరించి, పెద్ద మొత్తంలో రైతులు ఆయిల్ పామ్ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన పంటల అధికారి రమణ, డీఎస్​వో నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.