- గుండా ఈశ్వరయ్య స్కూల్ కు సామాగ్రి అందజేత
పద్మారావునగర్, వెలుగు: తాను కూడా ప్రభుత్వ బడిలోనే చదివానని, ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. బాల్యం నుంచే క్రమశిక్షణ, సమయపాలన అలవాటు చేసుకోవాలన్నారు. సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డివిజన్లోని గుండా ఈశ్వరయ్య హైస్కూల్‌కు ఐడీబీఐ బ్యాంక్ సీఎస్ఆర్కింద శనివారం 7 బీరువాలు, 50 కుర్చీలు, కార్పెట్, సౌండ్ సిస్టమ్ ఇతర సామాగ్రిని అందజేసింది.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను సొంత జీతం డబ్బులతో చెల్లిస్తున్నానని తెలిపారు. స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ జానకిరామన్ తదితరులు పాల్గొన్నారు.
