- కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకు తీసుకెళ్లాలి
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన
- కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి వచ్చాం : పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
ఖమ్మం టౌన్, వెలుగు : ‘రైతు భరోసా, మద్దతు ధరతో పాటు బోనస్ అందించి రైతులకు మేలు చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌పై కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తూ రైతులకు మేలు జరగకుండా కుట్ర పన్నుతున్నాయి’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. మంగళవారం ఖమ్మంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క హాజరయ్యారు.
ముందుగా కార్యకర్తలతో కలిసి కోదాడ క్రాస్ రోడ్డు నుంచి బైపాస్ మీదుగా ర్యాలీ నిర్వహించి, జడ్పీ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ ఆఫీస్‌లో అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర మిగతా ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు. అటువంటి కాంగ్రెస్‌లో సామాన్య కార్యకర్తగా పని చేయడమే అదృష్టం అన్నారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్దాంతం, రాజ్యాంగ హక్కులను కాపాడుకుంటూ పని చేయాలని నూతన కార్యవర్గానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అందజేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్డులోని అంబేద్కర్ బిల్డింగ్‌లో సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశానికి గుండెకాయ :
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
దేశానికి కాంగ్రెస్ పార్టీ గుండెకాయ అని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కార్యకర్తలు కష్టపడడం వల్లే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. పెత్తందారుల వ్యవస్థను ప్రతిఘటించేందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారన్నారు. బీఆర్‌ఎస్ గత పదేండ్లలో లెక్కకు మించి అప్పులు చేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఓ వైపు వడ్డీలు చెల్లిస్తూనే, మరో వైపు అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. కేటీఆర్ పాదయాత్ర కాదు, కిందపడి బొర్లినా ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. కవిత అడిగే ప్రశ్నలకు కేటీఆర్, హరీశ్, సంతోష్‌లు సమాధానం చెప్పిన తర్వాత పాదయాత్ర చేయాలన్నారు. మరో పదేండ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేవుళ్ల పేరు చెప్పి రాజకీయాలు చేసే బీజేపీని ఎవరూ నమ్మరన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం గోరంత పనిచేసి.. కొండంత ప్రచారం చేసుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొండంత పనిచేసినా చెప్పుకోవడంలో వెనుకబడ్డామన్నారు.

