నీళ్ల వివాదాలపై చర్చే జరగలేదు

నీళ్ల వివాదాలపై చర్చే జరగలేదు
  • సగంలోనే సభను ముగించిన్రు
  • టైం ఇవ్వకుండా మా గొంతు నొక్కిన్రు: భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య జరుగుతున్న కృష్ణా నీళ్ల వివాదాలపై కూడా చర్చించకుండా అసెంబ్లీ సమావేశాలను అర్ధంతరంగా ముగించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. అసెంబ్లీ సెషన్స్ లో చాలా అంశాలు చర్చకు వస్తాయని భావించామన్నారు. 12 అంశాలను చర్చించాలని బీఏసీ భేటీలో చెప్పామని, కానీ తాను ఇచ్చిన వాటిలో కేవలం రెండు ప్రశ్నలే చర్చకు వచ్చాయని తెలిపారు. సభలో సరైన టైం ఇవ్వకుండా గొంతు నొక్కారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత భట్టి మీడియా పాయింట్ లో మాట్లాడారు. సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమకు కనీస అవకాశం ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. 

ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలె
ఉపాధి హామీ ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. సంక్షేమంపై అసెంబ్లీలో జరిగిన షార్ట్‌‌‌‌ డిస్కషన్​లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌‌‌‌ హయాంలో తెచ్చిన అభయ హస్తం స్కీం కింద పేదలకు 9 రకాల సరుకులు అందించేవారని, కానీ ఇప్పుడు ఒక్క బియ్యం మినహా ఏవీ ఇవ్వడం లేదని అన్నారు. డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్లు ఇవ్వడంలేదని, ఇండ్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల సాయమైనా అందించాలని డిమాండ్​ చేశారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టులనే ఇప్పుడు కొనసాగిస్తున్నారని అన్నారు.