- ఐదేండ్లు పూర్తి చేసింది ఏడుగురే
యాదాద్రి, వెలుగు : భువనగిరి మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కోసం తరచూ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం, చైర్మన్లు మారడం జరిగింది. ఐదేండ్లలో ఇద్దరు, ముగ్గురు చైర్మన్ల చొప్పున మూడుసార్లు మారారు. ఈ మున్సిపాలిటీ చరిత్రలో పదవి కాలం పూర్తి చేసుకున్నది కేవలం ఆరుగురు చైర్మన్లే. మిగిలిన కాలమంతా పదవుల కోసం కౌన్సిలర్లు కొట్లాడుకోవడంతోనే సాగిపోయింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ ఒక చరిత్ర. నైజాం పాలనలో సుబా(జోన్) గా ప్రాచుర్యం పొందింది. ఇక్కడి నుంచే ఐదు జిల్లాలకు సంబంధించి పాలన సాగిందని చెబుతుంటారు.
భువనగిరిలో 1952లో ఎన్నికలు
భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికలు 1952లో తొలిసారిగా జరిగాయి. పరోక్ష పద్దతిలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్ర మండలి కౌన్సిలర్లు ఎక్కువ మంది గెలవడంతో.. తొలి మున్సిపల్ చైర్మన్‌గా ఎండీ అబ్బాస్ అలీ ఎన్నికయ్యారు. ఆ తరువాత జరిగిన వరుస ఎన్నికల్లో పీడీఎఫ్ తరుపున అబ్దుల్ రహమాన్ చిస్తీ, కాంగ్రెస్ నుంచి పట్నం వెంకటనర్సయ్య, పాదరాజు హనుమంతరావు వరుసగా ఎన్నికయ్యారు. పాదరాజు హనుమంతరావు ఒక్కడే దాదాపు 8 ఏండ్లు చైర్మన్‌గా కొనసాగారు.
ఎన్నికలు పరోక్షం.. ప్రత్యక్షం
మున్సిపాలిటీ ఎన్నికలు పరోక్ష, ప్రత్యక్ష పద్దతిలో కొనసాగాయి. తొలుత పరోక్ష పద్దతిలో నిర్వహించగా, తెలుగుదేశం హయాంలో ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించారు. తర్వాత మళ్లీ పరోక్షంగా నిర్వహించారు. భువనగిరిలో 1981 నుంచి 2020 వరకూ ఎన్నికల్లో అవిశ్వాస తీర్మాణాల కారణంగా పలుమార్లు చైర్మన్ల మార్పు జరిగింది. 1981 ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎక్కువ మంది గెలవడంతో.. సున్నం యాదగిరి చైర్మన్ అయ్యారు. 1983లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. ఢాకూరి కృష్ణ చైర్మన్ అయ్యారు. 1985లో మరోసారి తీర్మానం ప్రవేశపెట్టి.. మళ్లీ సున్నం యాదగిరి చైర్మన్ అయ్యారు.
ప్రత్యక్ష ఎన్నికలు
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించారు. 1987లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి శివనాగేందర్ మున్సిపల్ చైర్మన్‌గా గెలిచారు. 1992లో ఇండిపెండెంట్ అభ్యర్థి హబీబ్ రహమాన్ చైర్మన్‌గా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. 1995లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉట్కూరి దామోదర్ గౌడ్ చైర్మన్ అయ్యారు. 2000లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుపున పెంట నర్సింహా చైర్మన్ అయ్యారు. 2005లో నాలుగు నెలల పాటు అప్పటి భువనగిరి ఆర్డీవో కిష్టప్ప స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
మళ్లీ పరోక్ష పద్దతిలో..ఎన్నికలు
2005లో మళ్లీ పరోక్ష పద్దతిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎక్కువ మంది కౌన్సిలర్లు గెలవడంతో. దోనకొండ వనిత చైర్ పర్సన్ అయ్యారు. మూడేండ్ల తరువాత అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పదవి కోల్పోయారు. వైస్ చైర్మన్ కే కరుణాకర్ 11 నెలల పాటు ఇన్చార్జ్గా వ్యవహరించారు. 2009 జనవరి నుంచి 2010 సెప్టెంబర్ వరకూ చైర్మన్‌గా బర్రె జహంగీర్ వ్యవహరించారు.
సెప్టెంబర్ 2010 నుంచి జూన్ 2014 వరకూ నాలుగేండ్ల పాటు స్పెషల్ ఆఫీసర్ పాలన సాగింది. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు కుదుర్చుకొని పోటీ చేయగా.. పెద్దపార్టీగా నిలిచిన బీజేపీ కౌన్సిలర్ సుర్వి లావణ్య చైర్ పర్సన్ అయ్యారు. టీడీపీకి చెందిన కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
తన పదవిని కాపాడుకోవడానికి బీజేపీకి సుర్వి లావణ్య రాజీనామా చేసి.. టీఆర్ఎస్లో చేరారు. అయినప్పటికీ... అసమ్మతి చల్లారక పోవడంతో.. లావణ్య తిరిగి బీజేపీలోకి వచ్చారు. అనంతరం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో.. నువ్వుల ప్రసన్న చైర్ పర్సన్ అయ్యారు. పదవీ కాలం ముగియడంతో..2019 జూలై 3 నుంచి 2020 జనవరి వరకూ అప్పటి కలెక్టర్ అనితా రామచంద్రన్ పర్యవేక్షించారు.
2020 జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఎక్స్అఫిషియో ఓట్ల సహకారంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎనబోయిన ఆంజనేయులు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అవిశ్వాస తీర్మానం పెట్టి.. కాంగ్రెస్ నుంచి పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్ అయ్యారు.
వైస్ చైర్మన్‌గా బీజేపీ కౌన్సిలర్ మాయ దశరథ ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటాపోటీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తున్నారు. ఏ పార్టీకాపార్టీ గెలుపును చాలెంజ్‌గా తీసుకున్నారు.
