- ప్రతిగా బీజేపీ ఆఫీస్‌పై కాంగ్రెస్ రాళ్ల దాడి
- లాఠీచార్జ్చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు
- వరుస ఘటనలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో టెన్షన్
యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ శ్రేణులు దాడికి దిగారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీ ఆఫీస్‌పై రాళ్లను విసిరారు. పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా రెండు రోజుల కింద రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ శ్రేణులు దాడి చేయగా.. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీ జిల్లా ఆఫీస్‌పై దాడి చేశారు. ఈక్రమంలో మంగళవారం భువనగిరిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడి, బీజేపీ ఆఫీస్‌పై రాళ్ల దాడులు.. ఉమ్మడి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై కాషాయ పార్టీ లీడర్ల దాడి
భువనగిరిలోని ఎస్పీ ఆఫీసు, టౌన్ పోలీస్‌స్టేషన్‌సమీపంలో ఉన్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి క్యాంప్ ఆఫీసుపై బీజేపీ కార్యకర్తలు మంగళవారం దాడికి దిగారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే ఫొటో ఉన్న ఫ్లెక్సీకి నల్లరంగు పూశారు. అనంతరం ఆఫీస్‌లోకి చొరబడి గోడలపై నల్లరంగు చల్లారు.
అక్కడే ఉన్న కుర్చీలను విరగొట్టారు. క్యాంప్ ఆఫీసుపై దాడి జరిగిందన్న విషయం తెలియడంతో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు గుమిగూడి నల్గొండ రోడ్డులో ఉన్న బీజేపీ ఆఫీసు వైపు పరుగులు తీశారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అయినప్పటికీ.. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీసు వద్దకు చేరుకొని రాళ్లు విసిరారు. ఈ పరిణామంతో ఆఫీసులో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చారు. ఒక దశలో రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితి నెలకొంది. పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి
అదుపులోకి వచ్చింది.
వాగ్వాదాలు.. రాస్తారోకోలు.. దిష్టిబొమ్మ దహనం
పోలీసులతో బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు వేర్వేరుగా వాగ్వాదానికి దిగారు. తమ ఆఫీసులపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. భువనగిరి– నల్గొండ రోడ్డుపై బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు వేర్వేరుగా రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ దిష్టిబొమ్మను ఆ పార్టీ సమీపంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడి చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
12 మంది అరెస్ట్.. విడుదల
ఎమ్మెల్యేపై క్యాంపు ఆఫీస్‌పై దాడి ఘటనలో 12 మంది బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అనంతరం కండిషన్ బెయిల్‌పై వారిని విడుదల చేశారు.
నల్గొండలో టెన్షన్.. టెన్షన్
నల్గొండ, వెలుగు: కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య కొనసాగుతున్న ఘర్షణలతో నల్గొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీస్‌తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై పరస్పర దాడులు జరగడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంగళవారం నల్గొండ బీజేపీ జిల్లా ఆఫీస్ గేట్లను పోలీసులు మూసేయడం తీవ్ర దుమారం రేగింది. ఉదయం నుంచే ఆ పార్టీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. గేట్లకు తాళాలు వేసి ఎవరినీ లోపలికి అనుమతించకపోవడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఆఫీస్ వైపునకు దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రెండు పార్టీల లీడర్ల మధ్య ఘర్షణ పెరిగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఎదురుపడకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతోపాటు పట్టణంలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
