ఉమ్మడి నల్గొండ జిల్లాలో రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై బీజేపీ దాడి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై బీజేపీ దాడి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ రగడ రోజురోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల పరస్సర దాడులు, ధర్నాలతో దద్ధరిల్లుతోంది. 2026 ఆగస్టు 31న నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసిన బీజేపీ.. సెప్టెంబర్ 1వ తేదీన భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి దిగారు. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. 

మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి చొరబడిన బీజేపీ నేతలు.. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పూలకుండీలను ధ్వంసం చేశారు.  ఫ్లెక్సీలను  చించేశారు. ఫ్లెక్సీలపై బురద చల్లారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టారు.

మరోవైపు క్యాంపు ఆఫీసుపై దాడితో  ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడికి వెళ్లారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.  ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు  పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. రాళ్ళ దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో  ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టారు పోలీసులు. 

ఇక చౌటుప్పల్ మున్సిపాలిటీ  కేంద్రంలో ఆగస్టు 31న  బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం  వర్షిత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు చేశారని ఆరోపిస్తూ.. బీజేపీ నేతలు  జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. 

దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అదే సందర్భంలో బీజేపీ నేతలు దిష్టిబొమ్మ తగలబెట్టే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య  తోపులాట జరిగింది.