అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్ : హౌసింగ్ అధికారులపై ఎమ్మెల్యే దానం ఆగ్రహం

అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్ : హౌసింగ్ అధికారులపై ఎమ్మెల్యే దానం ఆగ్రహం

అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. దానం నాగేందర్ లోకల్ అంటూ కామెంట్స్ చేశారు హైదరాబాద్ సిటీ  ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌. ఇందిరమ్మ ఇళ్ల డ్రా కార్యక్రమంలో.. అధికారులు ప్రోటోకాల్‌ పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఆదర్శ్‌ నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దానం. 

హౌసింగ్‌ బోర్డు ఎండీ గౌతమ్‌ వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విమర్శించారు. మొదటి విడతలో ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి 480 ఇళ్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం 120 ఇళ్లనే కేటాయించారని.. మిగిలిన 360 ఇళ్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారాయన. స్థానిక ఎమ్మెల్యేగా.. నేను కార్యక్రమానికి రాక ముందే డ్రా నిర్వహించిజజ నియోజకవర్గానికి సంబంధం లేని వారికి ఇళ్లు కేటాయించారంటూ అధికారులపై మండిపడ్డారు ఎమ్మెల్యే దానం. 

హౌసింగ్ బోర్డు అధికారులు ఇదే విధంగా పాతబస్తీలో వ్యవహరించగలరా.. పాతబస్తీ ఎమ్మెల్యేల విషయంలో వ్యవహరిస్తే వారు దాడులు చేసేవారంటూ వార్నింగ్ ఇచ్చారాయన. గతంలో తాను ఓ అధికారిపై దురుసుగా వ్యవహరించినందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని.. మరోసారి అలాంటి పరిస్థితికి తనను దిగజార్చొద్దని అధికారులను హెచ్చరించారాయన. హౌసింగ్‌ బోర్డు ఎండీ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానని.. ఈ అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావిస్తానంటూ చెప్పుకొచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌. అధికారులు తమ వైఖరిని మార్చుకుని.. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పని చేయాలని సూచించారాయన.