హైదరాబాద్ మెట్రోకు 13 వేల కోట్ల రీఫైనాన్సింగ్.. ఐఆర్ఎఫ్సీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

హైదరాబాద్ మెట్రోకు 13 వేల కోట్ల రీఫైనాన్సింగ్.. ఐఆర్ఎఫ్సీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
  • 20 ఏండ్లపాటు మూడునెలలకోసారి చొప్పున కీస్తీల చెల్లింపు
  • ప్రభుత్వ గ్యారంటీ, ఆర్బీఐ సపోర్ట్​తో డైరెక్ట్​ డెబిట్ నిబంధన
  • అగ్రిమెంట్​పై ఐఆర్ఎఫ్​సీ సీఎండీ మనోజ్ కుమార్, సీఎస్ సంతకాలు

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు డబ్బుల సమస్య లేకుండా ఉండేందుకు రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌‌‌‌సీ)తో ఒప్పందం కుదిరింది. 

సోమవారం ఢిల్లీలో ఈ అగ్రిమెంట్​ జరిగింది. ఐఆర్ఎఫ్‌‌‌‌సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అధికారులు కలిసి పత్రాలపై సంతకాలు చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రోలో ఎల్ అండ్ టీ కంపెనీకి ఉన్న మొత్తం వాటాను తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో హైదరాబాద్ మెట్రో ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ప్రజా రవాణా వ్యవస్థగా మారింది. అధికారుల మాటల్లో చెప్పాలంటే, ఈ నిర్ణయంతో భవిష్యత్తులో మెట్రో సేవలను మరింత విస్తరించే అవకాశం ఉంటుంది.

కీలక మైలు రాయి..
హైదరాబాద్ మెట్రో భవిష్యత్ విస్తరణలకు బలమైన ఆర్థిక పునాది ఏర్పరచడంలో ఈ ఒప్పందం ఒక కీలక మైలురాయి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 69.2 కి.మీ పొడవుతో మూడు కారిడార్లు, 57 స్టేషన్లతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–1 దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేసిన అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ నెట్‌‌వర్క్ ద్వారా రోజుకు 5 లక్షలకు పైగా ప్రయాణికులు సేవలు పొందుతున్నట్లు చెప్పారు. ఈ రీఫైనాన్సింగ్ వల్ల హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఆర్థిక సామర్థ్యం మరింత బలోపేతం కావడంతో పాటు కొత్త కారిడార్లు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ, చివరి మైలు కనెక్టివిటీ వంటి విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు.

కాగా... రూ.13,600 కోట్ల ఈ సౌకర్యాన్ని ప్రస్తుత రుణ బాధ్యతలైన నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్‌‌కు వినియోగించనున్నారు. దీని ద్వారా ప్రస్తుత రుణదాతలకు క్రమబద్ధమైన ఎగ్జిట్ లభించడంతో పాటు ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వం గణనీయంగా మెరుగుపడనుందని అధికారులు వెల్లడించారు. ఈ రుణాన్ని 20 ఏండ్ల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల విధానంలో రూపొందించినట్లు తెలిపారు. అధిక వడ్డీ రుణాలను తక్కువ వ్యయంతో కూడిన దీర్ఘకాలిక రూపాయి ఫైనాన్సింగ్‌‌తో భర్తీ చేస్తామన్నారు.

ఈ లావాదేవీకి తెలంగాణ ప్రభుత్వ నిర్బంధ, కచ్చితమైన చెల్లింపు హామీ, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ, ఆర్‌‌బీఐ మద్దతుతో డైరెక్ట్ డెబిట్ మాండేట్ వంటి బలమైన క్రెడిట్ ఎన్‌‌హాన్స్‌‌మెంట్ వ్యవస్థ మద్దతుగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు,ప్రాయోజిత పధకాల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) ప్రతినిధి కె.వి.బి. రెడ్డి, సీఎఫ్‌‌వో ఏ.వి.ఆర్. శ్రీనివాస శర్మతో పాటు ఐఆర్ఎఫ్‌‌సీ , ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

దేశ ఆర్థిక వృద్ధిలో కీలకంగా హైదరాబాద్: సీఎస్ రామకృష్ణా రావు
దేశ ఆర్థిక వృద్ధిలో హైదరాబాద్ కీలక నగరంగా మారుతోందని సీఎస్ రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్ మెట్రో కోసం చేసిన రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్‌‌తో ప్రాజెక్టుకు పెద్ద ఆర్థిక ఊరట లభిస్తుందని తెలిపారు. దీంతో రుణ భారం తగ్గి, భవిష్యత్తులో మెట్రో విస్తరణకు ఉపయోగపడుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌‌లో ప్రజలకు ఉపయోగపడే ఆధునిక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున మెట్రో విస్తరణ చాలా అవసరమని తెలిపారు. ట్రాఫిక్ తగ్గించడంలో, ప్రజల ప్రయాణాన్ని సులభం చేయడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఈ ఒప్పందానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్ఎఫ్‌‌సీ, ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్ఎల్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.