ఆత్మహత్య కాదు.. హత్యే.. కానీ ఎందుకు చంపినట్లు ? పోలీసులకు సవాలుగా మారిన కేసు

ఆత్మహత్య కాదు.. హత్యే.. కానీ ఎందుకు చంపినట్లు ? పోలీసులకు సవాలుగా మారిన కేసు
  • ఒకే ఫ్యామిలీలో నలుగురి మృతి కేసులో వీడిన మిస్టరీ
  • డెడ్​బాడీలపై కత్తిగాట్లు, తలలపై తీవ్ర గాయాలు
  • హత్యే అని తేల్చిన పోస్టుమార్టం రిపోర్ట్
  • పోలీసులకు సవాలుగా మారిన కేసు
  • ఇప్పటివరకు దొరకని ఆధారాలు 
  • పలు కోణాల్లో విచారిస్తున్న నల్గొండ పోలీసులు

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంట్లో నలుగురు చనిపోయి ఉండడంతో అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేశారు. 

మొదట సూసైడ్ అయి ఉంటుందని భావించినప్పటికీ, పోలీసుల ప్రాథమిక విచారణ, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేలింది. నల్గొండకు చెందిన మహమ్మద్ సుల్తాన్ (45) ప్రకాశం బజార్​లోని లెదర్ షాపులో పనిచేస్తున్నాడు. అతని భార్య హసీనా (40) ఒక ప్రైవేట్ స్కూల్​లో టీచర్​గా పని చేస్తోంది.

సుల్తాన్ మొదటి భార్య చనిపోవడంతో కొన్నేండ్ల కిందట హసీనాను రెండో వివాహం చేసుకున్నాడు. సుల్తాన్​ మొదటి భార్య పిల్లలైన ముజమ్మిల్ (20), కూతురు అఫ్సారా (11) వీరితోనే ఉంటున్నారు.  నాలుగు రోజులకిందట ఈ ఘటన జరిగినా ఇంటి గేట్ బయట నుంచి తాళం వేసి ఉండటంతో వెలుగులోకి రాలేదు. 

పాలు, పేపర్ వేసేవారు కూడా వారు ఊరికి వెళ్లి ఉంటారని భావించారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు తెరిచి చూడగా నలుగురు కుటుంబ సభ్యులు కుళ్లిన స్థితిలో రక్తపు మడుగులో మరణించి కనిపించారు. 

అత్యంత కిరాతకంగా హత్య..
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల వరకు బాధితుల ఫోన్లు ఆన్‌‌‌‌లోనే ఉన్నాయి. కాబట్టి, రాత్రి 12 గంటల తర్వాతే ఈ ఘాతుకం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్​తో ముగ్గురు నలుగురు వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

8వ తరగతి చదువుతున్న పాపను జుట్టుపట్టి లోపలికి ఈడ్చుకొచ్చి తలపై బలంగా కొట్టి చంపినట్టు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురిని ఇంటి ఆవరణలో హత్య చేశారు. డెడ్ బాడీలపై కత్తి పోట్లు, తీవ్ర గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది. ఇల్లంతా చిందరవందరగా ఉండడంతో హత్య అనంతరం దుండగులు ఇంటిని వెతికినట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసును సవాల్​గా తీసుకున్నారు.

డీజీపీ సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు వివరాలను తెలుసుకున్నారు. స్వయంగా ఐజీ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ఆరు బృందాలుగా ఏర్పడి క్లూస్ టీమ్, సైంటిఫిక్ నిపుణులతో కలిసి ఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్, రక్తం మరకలను సేకరిస్తున్నారు. అయితే, చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం, పక్కింటి వాళ్లు కూడా వారం రోజులుగా లేకపోవడంతో ఘటనకు సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు. 

వేగంగా దర్యాప్తు
పోలీసులు కేసు దర్యాప్తును వేగంగా చేస్తున్నారు. ఇది దొంగల పని కాదని, పాత కక్షల వల్లనో, వ్యక్తిగత కారణాల వల్లనో హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. సుల్తాన్ భార్య హసీనాకు గతంలో మూడు పెండ్లిళ్లు జరిగాయి. ఆమెకు మాజీ భర్తలతో ఏమన్నా వివాదాలు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించినట్టు సమాచారం.

సుల్తాన్ కుమారుడికి భువనగిరికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఆ యువతికి సంబంధించిన వారెవరన్నా హత్య చేసి ఉంటారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయినవారి ఫోన్ కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక బృందం ఆరా తీస్తోంది. ఫోరెన్సిక్ రిపోర్ట్​ వస్తే దర్యాప్తు మరింత ముందుకెళ్తుందని ఉన్నతాధికారులు తెలిపారు.