
కొందరికి కోపమెక్కువ. ఇంకొందరికి వెటకారం ఎక్కువ. కొందరు అర్థం చేసుకోలేరు. మరికొందరు అర్థమయ్యేలా కన్వే చేయలేరు. దాంతో కాస్త కన్ఫ్యూజన్. బోలెడంత అగ్రెషన్. ప్రతి సోమవారం బిగ్‌బాస్ హౌస్ పరిస్థితి ఇదే. నామినేషన్ ప్రక్రియ పేరుతో ఒకరి తప్పుల్ని ఒకరు ఎత్తి చూపే ప్రయత్నంలో జరిగే రభస మామూలుగా ఉండదు. ఇవాళ కూడా సేమ్ సీన్ రిపీటయ్యింది.
వీకెండ్ ఎఫెక్ట్ తగ్గలా!
ప్రతి వీకెండ్ నాగార్జున వచ్చే రెండు ఎపిసోడ్స్‌లో చాలా జరుగుతుంటాయి. రకరకాల గేములు ఆడించి మరీ మనసులోని మాటల్ని బయట పెట్టిస్తుంటారాయన. ఆ క్రమంలో అందరూ ఓపెన్‌గా మాట్లాడుతుంటారు. అప్పటివరకు ఎవరికీ చెప్పని విషయాల్ని కూడా షేర్ చేసుకుంటారు. కొందరు అక్కడితో దాన్ని మర్చిపోతారు. కొందరు మాత్రం ఆ తర్వాత కూడా క్యారీ చేస్తుంటారు. ఈసారి కూడా అదే జరిగింది. నువ్వలా ఎందుకు అన్నావ్, ఇలా ఎందుకు చేశావ్ అంటూ రకరకాల చర్చలు మొదలయ్యాయి. క్లోజ్‌గా ఉండేవాళ్లు కలిసి మిగతావాళ్లని ఆడిపోసుకున్నారు. దీనిలో ఎప్పటిలాగే రేవంత్ ఎక్కువగా టార్గెట్ అయ్యాడు. అతని గురించే ఎక్కువ డిస్కషన్ జరిగినట్టు అనిపించింది. అంతలో నామినేషన్ ప్రక్రియకి గంట మోగింది.
సుదీప ఫైర్.. ఫైమా సెటైర్
సుదీపని ఇవాళ ఇద్దరు నామినేట్ చేశారు. రెండుసార్లూ గట్టిగానే ఎదురు తిరిగిందామె. ముందుగా రేవంత్ వీకెండ్ ఎపిసోడ్లో తనకి ఇచ్చిన సామెత విషయంలో సుదీపని తప్పుబట్టాడు. అది తనకి తగినది కాదని అన్నాడు. కానీ సుదీప ఒప్పుకోలేదు. తాను చేసింది కరెక్టేనని చెప్పింది. కోటిసార్లు చెప్పమన్నా అదే మాట చెబుతానంది. ఆ తర్వాత ఫైమా కూడా సుదీపని నామినేట్ చేసింది. నీకంటే నేను ఎక్కువ ఆట ఆడినప్పుడు నేను ఫ్లాట్ ఎలా అవుతాను, నువ్వు హిట్టు ఎలా అవుతావు అంటూ ఆర్గ్యుమెంట్‌కి దిగింది ఫైమా. సుదీప ఏదో చెప్పబోతే ఆడినవాళ్లకి తెలుస్తుంది అంటూ సెటైర్ వేసింది. దాంతో సుదీప్ సీరియస్ అయ్యింది. నేను ఆడాను అని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఫైమా ఏమాత్రం తగ్గలేదు. గట్టిగా మాట్లాడింది. సుదీప మీద సెటైర్లు వేస్తూనే ఉంది.
ఎవరు వీక్? ఎవరు ఫేక్?
గీతూకి మొత్తం ఆరు నామినేషన్లు వచ్చాయి. కీర్తి, శ్రీహాన్, బాలాదిత్య, సూర్య, రాజ్, వాసంతి ఆమెని నామినేట్ చేశారు. అనవసరమైన వాటిలో దూరుతుందని ఒకరు, కామెడీగా చేసింది తప్పుగా ఉందని ఒకరు.. ఇలా ఎవరి కారణాలు వాళ్లు చెప్పారు. అలవాటు ప్రకారం అందరివీ తొప్పాసి రీజన్స్ అని కొట్టి పారేసింది గీతూ. అయితే రాజ్‌తో మాత్రం గట్టిగా గొడవ పడింది. గేమ్‌లో రూల్స్ సరిగ్గా పాటించలేదని రాజ్ చెప్పడంతో రివర్సయ్యింది. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. ఆ తర్వాత గీతూ రాజ్‌ని తిరిగి నామినేట్ చేసింది. అప్పుడామె మాట్లాడిన తీరు టూమచ్‌గా అనిపించింది. ఈ హౌస్ మొత్తంలో నువ్వే వీక్, నీకసలు ఆడటం రాదు, రూల్స్ అర్థమే కావు, నువ్వు నాకు రూల్స్ గురించి చెప్పడమేంటి అంటూ నానా మాటలూ అంది. రాజ్ కూడా తగ్గకుండా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ గీతూ దగ్గర నెగ్గడం కష్టం కనుక వెనుకబడ్డాడు. రాజ్ కాస్త వీక్ అనేది నిజమే. అలాగే గీతూ చూపించే గాంభీర్యం కూడా ఒక్కోసారి ఫేక్ అనిపిస్తోంది. నాకో లెక్క కాదు అన్నట్టు యాక్ట్ చేస్తోంది కానీ అందరూ అనేవి ఆమె మీద ప్రభావం చూపిస్తాయనేది తన ముఖం చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది.
కీర్తి ఆవేశం.. ఆదిరెడ్డి ఆక్రోశం
ఇవాళ నామినేషన్ ప్రక్రియ మొత్తం ఆదిరెడ్డి, కీర్తిల చుట్టూ తిరిగినట్టు అనిపిస్తోంది. అతనికి ఏడు ఓట్లు, ఆమెకి ఆరు ఓట్లు పడ్డాయి. కెప్టెన్సీ విషయంలో ఇనయా కీర్తిని తప్పుబట్టింది. అప్పుడు కీర్తి ఘాటుగా స్పందించింది. నాకు ఎనభై మార్కులు పడ్డాయి, కెప్టెన్ అయ్యి అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుని చూపించు అంటూ ఇనయాని ఎగతాళి చేసింది. ఆదిరెడ్డి నామినేట్ చేసినప్పుడు కూడా గట్టిగానే జవాబిచ్చింది. మెరీనా, సుదీప కూడా కీర్తిని నామినేట్ చేశారు. అన్నీ నమ్మి చెప్పినా నువ్వు శ్రీసత్య విషయంలో నన్ను బ్యాడ్ చేశావంటూ అర్జున్ నామినేట్ చేశాడు. మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ప్రవోక్ చేస్తున్నానని అనడం తప్పు అంటూ శ్రీసత్య నామినేట్ చేసింది. అయితే నాగార్జున తన కెప్టెన్సీకి ఎనభై మార్కులు ఇచ్చారనే ఓవర్ కాన్ఫిడెన్స్ కీర్తిలో కనిపించింది. తన యాటిట్యూడ్ కాస్త మారినట్టు అనిపించింది.
ఇక ఆదిరెడ్డి అయితే తాను నామినేట్ చేసేటప్పుడు, తనని ఇతరులు నామినేట్ చేసేటప్పుడు కూడా ఆవేశంతో ఊగిపోయాడు. ఎవరు ఏం చెబుతున్నా వినకుండా ఏదేదో మాట్లాడేయడానికి ప్రయత్నించాడు. తాను చెప్పేది కరెక్ట్, ఇతరులు చెప్పేదానిలో మీనింగ్ లేదు అని ప్రూవ్ చేయాలని ప్రయత్నించాడు. ఆ క్రమంలో తనని ఎక్కువమంది నామినేట్ చేస్తున్నందుకు టెన్షన్ పడుతున్నాడనే విషయం బైటపడిపోయింది. ఆవేశంగా మాట్లాడటమే కాక రోహిత్ మీదికి రయ్యిన దూసుకుపోయాడు. కలిసి ఆడుతున్నారు, భార్యని సపోర్ట్ చేస్తున్నావ్ అంటూ లిమిట్స్ దాటి మాట్లాడాడు. ఎప్పుడూ గట్టిగా మాట్లాడని రోహిత్ కూడా ఆవేశంగా అరిచాడు. కాస్త ఆలోచించి మాట్లాడితే ఇంకా గొప్పవారవుతారు అంటూ మెరీనా సెటైర్ వేసింది. ఇదే విషయం కీర్తి కూడా చెప్పింది. కాస్త ఆలోచించి మాట్లాడండి అని పదే పదే చెప్పింది. అయినా కూడా ఆదిరెడ్డి అగ్రెషన్ ఇవాళ హద్దులు దాటింది. నేను అందరినీ బాగా అనలైజ్ చేయగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడనిపిస్తోంది. ఇది అతని ఓటింగ్‌పై నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.
మొత్తంగా ఈవారం గీతూ, సుదీప, బాలాదిత్య, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్, రాజ్, శ్రీసత్య, మెరీనాలు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు తమ ఆటతో ఎక్కువ ఓట్లు సంపాదించి సేవ్ అవుతారో, ఎవరు డేంజర్ జోన్లో పడతారో అప్పుడే చెప్పడం కష్టం. రేపు కెప్టెన్సీ టాస్క్ మొదలవబోతోంది. ఇది కాస్త ఎమోషనల్‌గా ఉండబోతోందని ప్రోమో ద్వారా అర్థమయ్యింది.