
- చర్లపల్లిలో 150 ఎకరాల్లో భారీ టెర్మినల్ కు ప్లాన్
- ప్రాజెక్టుకు భూమి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం..
- 50 ఎకరాల రైల్వే భూమిలోనే నిర్మాణం: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్: గతంలో కన్నా బీజేపీ అధికారంలోకి వచ్చాక రైల్వేకు ఏడింతలు ఎక్కువ నిధులు ఇచ్చినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికే రూ.1813 కోట్లు అదనంగా కేటాయించామన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాజెక్టులకు సహకారం అందించడం లేదని ఆయన ఆరోపించారు.
సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధిలోని ఎంపీలతో జీఎం గజానన్ మాల్యా సమావేశం నిర్వహించారు. రైల్వే సమస్యలు, రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, సోయం బాబురావు, బండి సంజయ్, అరవింద్, రాయచూర్ ఎంపీ అమ్రేశ్వర్ నాయక్, రంజిత్ రెడ్డి, గుల్బర్గా ఎంపీ ఉమేష్ జి యాదవ్, నాగర్ కర్నూలు ఎంపీ.రాములు, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, బండ ప్రకాశ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణకు అదనంగా రూ.1813 కోట్లు
పార్లమెంట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఎస్సీఆర్ పరిధిలోని ఎంపీల సమావేశం నిర్వహించామని కిషన్ రెడ్డి చెప్పారు. చర్లపల్లిలో 150 ఎకరాల విస్తీర్ణంలో భారీ రైల్వే టెర్మినల్ నిర్మించాలని కేంద్రం భావించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని అన్నారు. ఇక చేసేది లేక 50 ఎకరాల రైల్వే స్థలంలోనే నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఎంఎంటీఎస్ పనులకు ఇవ్వాల్సిన రూ.400 కోట్లు విడుదల చేయలేదని, దాని వల్ల రెండో దశ పనులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు వేగవంతం అయ్యేందుకు కృషి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హయాంతో పోల్చుకుంటే ఏడింతలు ఎక్కువగా బీజేపీ ప్రభుత్వం రైల్వేకు నిధులు కేటాయించిందన్నారు. 1813 కోట్లు ఒక్క తెలంగాణకే అదనంగా కేటాయించామన్నారు. ప్రతి రెండు నెలలకోసారి రైల్వే అధికారులతో రివ్యూ చేసి పనులు వేగవంతం చేసేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.