- మొదటి విడతకు ముగిసిన ప్రచార గడువు
- ఫస్ట్ ఫేజ్ బరిలో తేజస్వీ యాదవ్, సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, తేజ్ ప్రతాప్ యాదవ్
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ కు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాలకుగాను 18 జిల్లాల్లోని 121 సీట్లకు గురువారం ఎన్నికల సంఘం ఓటింగ్ నిర్వహించనుంది. అన్ని పార్టీల నుంచి కలిపి మొత్తం 1,314 మంది అభ్యర్థులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పోటీ చేస్తున్న రాఘోపూర్, తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో ఉన్న మహువా కూడా ఉన్నాయి.
అలాగే, తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి (బీజేపీ), లఖీసరాయ్ నుంచి మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా(బీజేపీ), అలీనగర్ నుంచి సింగర్ మైథిలీ ఠాకూర్ (బీజేపీ), మొకామా నుంచి అనంత్ సింగ్ (జేడీయూ) వంటి ప్రముఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు. ఇక ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మొదటి విడత ప్రచారంలో చివరి రోజున ఎన్డీయే తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్ విస్తృతంగా ర్యాలీలు నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా బిహార్ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహాగఠ్ బంధన్ కూటమి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తదితరులు ముమ్మరంగా ప్రచారం చేశారు. కాగా, బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా, మొదటి విడత 121 సీట్లు పోను, మిగిలిన 122 సీట్లకు ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
