వందలోపు ఓట్లతో ముగ్గురు..250 ఓట్లతో మరో ముగ్గురు బిహార్ లో అతి తక్కువ మెజార్టీ ఎమ్మెల్యేలు వీరే

వందలోపు ఓట్లతో ముగ్గురు..250 ఓట్లతో మరో ముగ్గురు  బిహార్ లో అతి తక్కువ మెజార్టీ ఎమ్మెల్యేలు వీరే

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు కేవలం వంద లోపు ఓట్ల మార్జిన్​తో విజయం సాధించారు. మరో మూడు స్థానాల్లో 250 ఓట్ల లోపు తేడాతోనే జయాపజయాలు తేలాయి. భోజ్ పూర్ జిల్లా సందేశ్ నియోజకవర్గంలో జేడీ(యూ) అభ్యర్థి రాధా చరణ్ షా తన సమీప ఆర్‌‌జేడీ అభ్యర్థి దీపు సింగ్‌‌పై కేవలం 27 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

రామ్‌‌గఢ్ సీటులో బీఎస్పీ అభ్యర్థి సతీశ్ కుమార్ సింగ్ యాదవ్.. బీజేపీ కేండిడేట్ అశోక్ కుమార్ సింగ్‌‌ను 30 ఓట్ల తేడాతో ఓడించారు. బిహార్​లో 192 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ గెలుచుకున్న ఏకైక సీటు ఇదే కావడం గమనార్హం. ఆర్రా జిల్లా అగియోన్ స్థానంలో సీపీఐ(ఎమ్ఎల్) లిబరేషన్ అభ్యర్థి శివ ప్రకాశ్ రంజన్ పై బీజేపీ అభ్యర్థి మహేశ్ పాశ్వాన్‌‌ 95 ఓట్ల తేడాతో గెలిచారు. 

అలాగే నవీనగర్ స్థానంలో జేడీ(యూ) అభ్యర్థి చేతన్ ఆనంద్.. ఆర్‌‌జేడీ అభ్యర్థి అమోద్ కుమార్ సింగ్‌‌పై 112 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఢాకా స్థానంలో ఆర్‌‌జేడీ అభ్యర్థి ఫైసల్ రహ్మాన్ 178 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ జైస్వాల్‌‌ను ఓడించారు. ఫోర్బెస్‌‌గంజ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ బిశ్వాస్ 221 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన  అభ్యర్థి విద్యా సాగర్ కేశరి‌‌ని ఓడించారు.