బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ముగిసింది.. గురువారం ( నవంబర్ 6) సాయంత్రం 5 గంటల వరకు 60.13 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొదటి దశలో భాగంగా 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెగుసరాయ్ నియోజకవర్గంలో అత్యధికంగా 59.82శాతం పోలింగ్ నమోదైంది.పాట్నాలో మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యల్పంగా 48.69శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు 60.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ సమయం ముగిసిన సమయంలో క్యూలో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
తొలివిడత బీహార్‌లోని 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో 1314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. దాదాపు 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కులు ను వినియోగించుకున్నారు. పాట్నా, దర్భంగా, మాధేపురా, సహర్సా, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, సివాన్, సరన్, వైశాలి, సమస్తిపూర్, బెగుసరాయ్, లఖిసరాయ్, ముంగేర్, షేక్‌పురా, నలంద, బక్సర్ మరియు భోజ్‌పూర్‌లలో మొదటి దశలో ఓటింగ్ జరిగింది.
ఓటేసిన ప్రముఖులు..
పట్నాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav), ఆయన సతీమణి రాజశ్రీ యాదవ్, లాలూ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు.కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖిసరయ్‌లో ఓటు వేశారు. మరో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) పట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్, ఆయన సతీమణి హజీపూర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్, మహాగఠ్‌బంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ముకేశ్ సహనీ తన కుటుంబంతో కలిసి దర్భంగాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
