కౌన్ బనేగా బిహార్ రాజ్.. రాష్ట్రంలో 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ 14న కౌంటింగ్

కౌన్ బనేగా బిహార్ రాజ్.. రాష్ట్రంలో 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ 14న కౌంటింగ్
  • విజయంపై ఇటు ఎన్డీయే,  అటు మహాఘట్​బంధన్​ ధీమా

పాట్నా: బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్​ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికలు జరగగా.. రిజల్ట్స్​పై అన్ని పార్టీలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. ఎగ్జిట్​పోల్స్​ ఎన్డీయే కూటమికి అనుకూలంగా వచ్చినప్పటికీ.. ఎగ్జాక్ట్​ పోల్స్​ ఫలితాలు మాత్రం తమకే అనుకూలంగా ఉంటాయని మహాఘట్​బంధన్​ కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నది. ఓట్ల లెక్కింపు కోసం 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వోలు), 243 మంది కౌంటింగ్​ ఆబ్జర్వర్స్​డ్యూటీలో ఉంటారని ఎలక్షన్​ కమిషన్​ గురువారం తెలిపింది. 

అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్​ కొనసాగుతుందని పేర్కొంది. మొత్తం 4,372 కౌంటింగ్​ టేబుల్స్​ ఏర్పాటు చేస్తున్నామని.. ప్రతి టేబుల్​కు కౌంటింగ్​ సూపర్​ వైజర్, కౌంటింగ్​ అసిస్టెంట్​, మైక్రో అబ్జర్వర్​​ కూడా ఉంటారని వివరించింది. అభ్యర్థుల తరఫున దాదాపు 18 వేల మంది కౌంటింగ్​ ఏజెంట్లు ఉంటారని పేర్కొంది. 

రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటన

ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. మొదట పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లను లెక్కి స్తారు. ఆ తర్వాత అరగంటకు అంటే 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను ఫామ్​ 17సీలోని ఎంట్రీలతో సరిపోలుస్తారు. తేడా ఉంటే.. వీవీప్యాట్​ స్లిప్పులనూ లెక్కిస్తారు. ఇందుకోసం సెగ్మెంట్​లోని ర్యాండమ్​గా ఐదు పోలింగ్​ స్టేషన్స్​లోని వీవీప్యాట్​లను సెలెక్ట్​ చేసుకుంటారు.

ఫలితాలను రౌండ్ల వారీగా రిటర్నింగ్​ ఆఫీసర్లు ప్రకటిస్తారు. ఎప్పటికప్పుడు ఈసీ వెబ్​సైట్​లో ఉంచుతారు. తాము అధికారికంగా ప్రకటించే ఫలితాలను మాత్రమే నమ్మాలని, వాటినే జనానికి చేరవేయాలని మీడియాకు ఈసీ సూచించింది. 

ట్రక్కు కలకలం

రోహ్తాస్​లోని కౌంటింగ్​ సెంటర్​కు ఈవీఎంలతో కూడిన ట్రక్కు వెళ్లిందంటూ ఆర్జేడీ ఆరోపణలు గుప్పించింది. దీనిపై నిరసనలు వ్యక్తం చేసింది.  ఈ నేపథ్యంలో జిల్లా మెజిస్ట్రేట్​ (డీఎం) మాట్లాడుతూ.. ‘‘కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన ట్రక్కులో ఖాళీ స్టీల్ పెట్టెలు మాత్రమే ఉన్నాయి.  అందరి సమక్షంలో వాటిని తనిఖీ చేశాం. ఆ ట్రక్కు స్ట్రాంగ్ రూమ్‌‌కు దాదాపు 500 మీటర్ల దూరంలో పార్క్ చేసి ఉంది” అని పేర్కొన్నారు. అవాస్తవాలను నమ్మొద్దని సూచించారు.