బిహార్లో ముగిసిన ప్రచారం.. నవంబర్ 11న ఫైనల్ ఫేజ్ పోలింగ్

బిహార్లో ముగిసిన ప్రచారం.. నవంబర్ 11న ఫైనల్ ఫేజ్ పోలింగ్
  • ఆఖరి విడతలో 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఓటింగ్ 
  • నిన్నటితో ముగిసిన ప్రచార గడువు  
  • 14న ఓట్ల లెక్కింపు  

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సెకండ్ ఫేజ్(ఆఖరి విడత) పోలింగ్ కు రంగం సిద్ధమైంది. సెకండ్ ఫేజ్ కు ప్రచార గడువు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. చివరి రోజున ఆయా పార్టీల నుంచి స్టార్ క్యాంపెయినర్లు విస్తృతంగా ప్రచారం చేశారు. మంగళవారం ఆఖరి విడత ఓటింగ్ ను ఈసీ నిర్వహించనుంది. బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా, రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 6న మొదటి విడతలో 18 జిల్లాల్లోని 121 సీట్లకు ఎన్నికలు జరగగా, 11న రెండో (ఆఖరి) విడతలో 20 జిల్లాల్లోని 122 సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

రెండో విడత ఎన్నికల్లో మొత్తం 1,302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 1,165 మంది పురుషులు, 136 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి ఉన్నారు. మొత్తం 109 పార్టీల నుంచి 840 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. 462 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. ఈ విడతలో గయ, భాగల్పూర్, మధుబని, కటిహర్, పూర్ణియా, వెస్ట్ చంపారన్ వంటి కీలక నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. చకాయ్ నుంచి మంత్రి సుమిత్ కుమార్ సింగ్ (జేడీయూ), జమూయ్ నుంచి ఎమ్మెల్యే శ్రేయసీ సింగ్ (బీజేపీ), ధమ్దాహ నుంచి మంత్రి లేషీ సింగ్ (జేడీయూ), ఛత్తాపూర్ నుంచి మంత్రి నీరజ్ కుమార్ సింగ్ (బీజేపీ) వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. కాగా, ఈ నెల 6న జరిగిన ఫస్ట్ ఫేజ్ లో బిహార్ చరిత్రలోనే అత్యధికంగా 65 శాతం పోలింగ్ నమోదైంది.