పాట్నా: కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు మరో 26 మందిని విడుదల చేస్తూ రాష్ట్ర సర్కార్ సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. 14 ఏండ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఆనంద్ మోహన్.. ప్రస్తుతం పెరోల్‌పై బయట ఉన్నారు. తన కొడుకు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ ఎంగేజ్మెంట్ కోసం పెరోల్‌పై వచ్చారు. సర్కార్ ఉత్తర్వులపై ఆనంద్ మోహన్ సంతోషం వ్యక్తంచేశారు.
కాగా, జైలు మాన్యువల్ రూల్స్ ను ప్రభుత్వం ఇటీవల మార్చింది. ప్రభుత్వ ఉద్యోగి హత్య, రేప్ వంటి తీవ్రమైన నేరాలలో 14 ఏండ్ల శిక్ష అనుభవించిన తర్వాత కూడా విడుదల చేసేందుకు వీల్లేదని నిబంధనలు ఉండగా, వాటిని మార్చేసింది. దీంతో ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యేందుకు అవకాశం ఏర్పడింది. తీవ్రమైన నేరాల్లో శిక్ష పడ్డ వీళ్లను రూల్స్ మార్చి మరీ విడుదల చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఏంటీ మోహన్ కేసు?
ఆనంద్ మోహన్ మొదట గ్యాంగ్ స్టర్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో తెలంగాణకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ జి.కృష్ణయ్య హత్య కేసులో ఆనంద్ మోహన్ అరెస్టు అయ్యారు. అప్పట్లో జి.కృష్ణయ్య గోపాల్ గంజ్ కలెక్టర్ గా ఉన్నారు. ఆ టైమ్ లో గ్యాంగ్ స్టర్ చోటన్ శుక్లాను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీంతో అల్లర్లు చెలరేగాయి. జి.కృష్ణయ్య కారులో వెళ్తుంటే అల్లరి మూక దాడి చేసి, తీవ్రంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు.