బిహార్ బాలిక వేధింపుల కేసు.. నిందితుడి అరెస్టులో హైడ్రామా

బిహార్ బాలిక వేధింపుల కేసు.. నిందితుడి అరెస్టులో హైడ్రామా

పాట్నా: బిహార్‌‌‌‌లోని జముయీ జిల్లాలో బాలికపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి నిందితుల అరెస్టు సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు నవీన్ యాదవ్, హరేరామ్‎లను అదుపులోకి తీసుకునే సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం ఈ కేసు వివరాలను జముయీ ఎస్పీ బిస్వజిత్ దయాల్ మీడియాకు వెల్లడించారు. 

కోచింగ్ క్లాసు నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న హైస్కూల్ బాలుడు, బాలికలను కొందరు దుండగులు అడ్డగించి దాడి చేశారని చెప్పారు. ఈ నెల 19న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెలుగులోకి వచ్చిందన్నారు. బాధితులు ఫిర్యాదు చేయనప్పటికీ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశామని చెప్పారు. 

బాధితులను గుర్తించి విచారించిన తర్వాత నిందితుల్లో ముగ్గురు మైనర్లను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ప్రధాన నిందితులు నవీన్ యాదవ్, హరేరామ్ ల ఆచూకీకి సంబంధించిన సమాచారం అందిందని, దీంతో వారిని అరెస్టు చేయడానికి మంగళవారం తెల్లవారుజామున ఓ పోలీసు బృందం వెళ్లిందన్నారు. పోలీసుల రాకను గుర్తించి నవీన్ యాదవ్  కాల్పులకు తెగబడ్డాడని, లొంగిపొమ్మని హెచ్చరించినా వినిపించుకోలేదని తెలిపారు. 

పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నవీన్ కాలుకు బుల్లెట్ గాయం అయిందని, పారిపోయే ప్రయత్నంలో పడడంతో హరేరామ్ మోకాలి చిప్పలకు తీవ్ర గాయాలయ్యాని ఎస్పీ దయాల్ వివరించారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మహిళల భద్రతకు భంగం కలిగించే దుశ్చర్యలను సహించబోమని బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌదరి స్పష్టంచేశారు.