వజ్రాల దొంగలు దొరికిన్రు

వజ్రాల దొంగలు దొరికిన్రు

బీహార్​ ముఖియా గ్యాంగ్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు

    హైదరాబాద్​ నగల వ్యాపారి ఇంట్లో 2.5 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు నగల చోరీ

    ఇండ్లలో పని మనుషులుగా చేరి దొంగతనాలు

    బంగారం, డైమండ్స్​ టార్గెట్​గా లూటీలు

    దేశమంతటా 50కిపైగా చోరీలు

    అదుపులో ఐదుగురు.. పరారీలో ఒకడు

పని మనుషుల్లా ఇండ్లల్లో చేరతారు. మంచోళ్లలా యజమానులను నమ్మిస్తారు. అదును చూసి డబ్బు, నగలు దోచేసి ఉడాయిస్తారు. దోచిన సొత్తును గోడల్లో దాచేస్తారు. ఇదీ బీహార్​ ముఖియా గ్యాంగ్​ చోరీల తీరు. డబ్బున్నోళ్ల ఇళ్లనే టార్గెట్​ చేస్తున్న ఆ దొంగల ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఆరుగురు సభ్యుల ముఠాలోని నలుగురిని అరెస్ట్​ చేసి రూ.2.5 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో పని మనుషులుగా చేరి దేశవ్యాప్తంగా 50 చోరీలకు పాల్పడిన ముఖియా గ్యాంగ్​ వివరాలను హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ వెల్లడించారు.

అడ్డు తగిలితే చంపేందుకూ వెనకాడరు

భగవత్​ ముఖియా (32).. సొంతూరు బీహార్​ మధుబని జిల్లాలోని నిర్భాపూర్​. ఇండ్లలో వంట మనిషిగా చేరి యజమానుల కళ్లుగప్పి చోరీలకు పాల్పడేవాడు. అదే ప్రాంతానికి చెందిన రామ్​ ఆశిష్​ ముఖియా అలియాస్​ కరన్​, రాహుల్​ ముఖియా, పీతాంబర్​ మండల్​, భోలా ముఖియా, హరిశ్చంద్ర ముఖియాతో కలిసి గ్యాంగ్​ ఏర్పాటు చేశాడు. గ్యాంగ్​ను భోలా ముఖియా లీడ్​ చేసేవాడు. డబ్బున్నోళ్ల ఇండ్లలో పనిచేసేందుకు వంట మనిషి, కార్​ డ్రైవర్​, స్వీపర్​, కేర్​టేకర్​ వంటి వాళ్లను సప్లై చేసే ఏజెంట్​గా అవతారమెత్తాడు. దేశంలోని మెట్రో సిటీలతో పాటు హర్యానా, జార్ఖండ్​ లాంటి రాష్ట్రాల్లో సంపన్నులను టార్గెట్​ చేశాడు. 2005 నుంచి ఢిల్లీ, చెన్నై, పాట్నాల్లో చోరీలకు పాల్పడ్డారు. అక్కడి పోలీస్​ రికార్డుల్లో మోస్ట్​ వాంటెడ్​ దొంగల లిస్టులో చేరారు. నిర్భాపూర్​కు చెందిన దాదాపు 20 మంది ఆ లిస్టులో ఉన్నారు. చోరీ చేసేటప్పుడు ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాడి చేసే హతమార్చేందుకూ ముఖియా గ్యాంగ్​ వెనకాడదు. పోలీసులు పట్టుకున్నా దొంగిలించిన సొమ్ము దొరక్కుండా ఇండ్ల గోడల్లో దాచేస్తుంది. స్టేషన్​ నుంచి బయటికొచ్చాక వాటిని బయటకు తీసి అమ్మేస్తుంది. తర్వాత మళ్లీ యథావిధిగా పక్క దేశం నేపాల్​తో పాటు వేరే సిటీల్లో దొంగతనాలకు స్కెచ్​ వేస్తుంది.

45 రోజుల మఫ్టీలో..

నిరుడు అక్టోబర్​లో హైదరాబాద్​ను టార్గెట్​ చేసింది భగవత్​ ముఖియా గ్యాంగ్​. బంజారాహిల్స్​ రోడ్​ నెంబర్​12లోని నగల వ్యాపారి కపిల్​ గుప్తాను ట్రాప్​ చేసింది. అతడి ఇంట్లో రామ్​ ఆశిష్​ ముఖియాను వంట మనిషిగా చేర్పించాడు భోలా. ఇంట్లో బంగారం, డబ్బు దాచే సీక్రెట్​ లాకర్లు, వాటి తాళాలుండే ప్లేస్​లను రామ్​ ఆశిష్​ ముఖియా గుర్తించాడు. డిసెంబర్​ 8న హైదరాబాద్​ శంషాబాద్​లో జరిగే దగ్గరి బంధువుల పెళ్లికి వెళ్లింది కపిల్​ గుప్తా కుటుంబం. ఆ రోజు అర్ధరాత్రి టైంలో ముఖియా గ్యాంగ్​ చోరీ చేసింది. రూ.కోటిన్నర విలువైన వజ్రాలతో పాటు, కోటి రూపాయల విలువైన ఆభరణాలను దొంగిలించి బీహార్​ పారిపోయింది. తెల్లారి ఇంటికి వచ్చిన కపిల్​ గుప్తా, చోరీ జరిగిన విషయం తెలుసుకున్నాడు. వంటమనిషిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీపీ కె.ఎస్​. రావు ఆధ్వర్యంలో డిటెక్టివ్​ ఇన్​స్పెక్టర్​ రవికుమార్​ టీం కేసు దర్యాప్తును మొదలుపెట్టింది. రామ్​ ఆశిష్​ ముఖియా ఫోన్​ నంబర్​ను ట్రాక్​ చేసి బీహార్​లో ఉన్నట్టు తేల్చింది. మధుబని జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఆంధ్రటాడి సిజౌలి, నిర్భాపూర్​, హుస్సేన్​ పూర్​, కొథియా, బిరాల్​లో ముఖియా గ్యాంగ్​ ఉన్నట్టు గుర్తించింది. అయితే, అప్పటికే తప్పించుకు పారిపోయిన రామ్​ ఆశిష్​ ముఖియా, దోచిన సొత్తును గోడల్లో దాచి మహిళలను కాపలాగా పెట్టిపోయాడు. ఎవరైనా వస్తే తుపాకులు, కత్తులతో దాడి చేసేలా స్థానిక యువకులను ఏర్పాటు చేశాడు. అయితే, వాళ్లను పట్టుకునేందుకు రవికుమార్​ టీం 45 రోజుల పాటు మారువేషాల్లో నిఘా పెట్టింది. గత నెలలో భగవత్​ ముఖియా, భోలా ముఖియా, హరిశ్చంద్ర ముఖియాను అరెస్ట్​ చేసింది. గోడల్లో దాచిన సొత్తును స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రామ్​ ఆశిష్​ ముఖియాను బుధవారం అరెస్ట్​ చేసింది. పరారీలో ఉన్న రాహుల్​ ముఖియా, పీతాంబర్​ మండల్​ కోసం
వెతుకుతోంది.

హాక్ఐ యాప్ను వాడండి

ఇలాంటి చోరీలు జరగకుండా ప్రజలు హాక్​ ఐ యాప్​ను వాడుకోవాలి. పనిమనిషి వెరిఫికేషన్​తో పాటు, ఇండ్లల్లో రెంట్​కు వచ్చే వాళ్ల వివరాల వెరిఫికేషన్​ కోసం హాక్​ఐ యాప్​లో రిక్వెస్ట్​ పెట్టాలి. మా దగ్గరున్న డేటా ఆధారంగా పనివాళ్ల చరిత్ర తెలుసు కుంటాం. దీంతో చోరీలు జరిగిన వెంటనే నిందితులను అరెస్ట్​ చేసే వీలుంటుంది.

– అంజనీ కుమార్​, హైదరాబాద్​ సీపీ