కొత్త ఆవిష్కరణలకు వేదిక బయో ఏషియా..రెండు రోజులు HICCలో సదస్సు

కొత్త ఆవిష్కరణలకు వేదిక బయో ఏషియా..రెండు రోజులు HICCలో సదస్సు
  • రేపు, ఎల్లుండి హెచ్ఐసీసీలో సదస్సు
  • హాజరుకానున్న 50 దేశాలకు చెందిన 
  • 3వేల మంది ప్రతినిధులు.. 
  • ఈ సారి ప్రత్యేకంగా ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. లైఫ్​సైన్సెస్, హెల్త్​కేర్ సెక్టార్​లపై రెండు రోజుల పాటు హైదరాబాద్​లోని హెచ్ఐసీసీ వేదికగా ‘క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్: ఎక్స్​పాండింగ్ గ్లోబల్ హెల్త్​కేర్ ఫ్రాంటియర్స్’ పేరిట 22వ ఎడిషన్​ సదస్సు నిర్వహించనున్నారు. 50 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. బయో ఏషియా 2025లో ఈసారి ప్రత్యేకంగా ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటు చేయనున్నారు. సదస్సులో తమ ప్రొడక్ట్స్ ను ప్రదర్శించేందుకు 700 స్టార్టప్ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 80 స్టార్టప్​లకు మాత్రమే అవకాశం కల్పించారు. ఇన్నొవేషన్ జోన్​లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు, పురోగతిపై సదస్సులో చర్చిస్తారు. హెల్త్​కేర్​ రంగంలో ఏఐ తీసుకొచ్చిన మార్పులు, లైఫ్​సైన్సెస్​లో కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీ బలోపేతం, ఇంటిగ్రేటెడ్ హెల్త్​కేర్ మోడల్స్​ తదితర అంశాలను ఎజెండాగా నిర్ణయించారు. బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అధునాతన చికిత్సా విధానాలు, అత్యాధునిక వైద్యం, ఆరోగ్య సంరక్షణ విధానాలపై చర్చించనున్నారు. హెల్త్​కేర్, లైఫ్​సైన్సెస్ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు చేసిన సంస్థలు, నిపుణులను సదస్సు ద్వారా ప్రోత్సహించనున్నారు. సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, క్వీన్స్ లాండ్ గవర్నర్ డాక్టర్ జీనెల్ యంగ్, జీ20 షెర్పా అమితాబ్ కాంత్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు సదస్సులో ప్రసంగించనున్నారు.

పెట్టుబడులకు గమ్యస్థానం

తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు ఈ బయో ఏషియా సదస్సు ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. హెల్త్​కేర్ ఇన్నొవేషన్ హబ్​గా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. పానెల్ డిస్కషన్​లో ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ సోమ్​నాథ్, డాక్టర్ రెడ్డీస్​ ల్యాబ్స్ చైర్మన్ సతీశ్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా, లారస్ ల్యాబ్స్ సీఈవో సత్యనారాయణ చావా, నోవార్టిస్​ ఏషియా పసిఫిక్​ రీజియన్​ చీఫ్, కమర్షియల్ ఆఫీసర్ సీజర్ కాన్సెప్షన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెల్ టక్కర్ పాల్గొననున్నారు. వారితో పాటు ఆమ్జెన్​ చైర్మన్ సీఈవో రాబర్ట్ బ్రాడ్​వే, జీనోమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాట్రిక్ టాన్, మెడ్ ట్రానిక్ సీటీవో డాక్టర్ కెన్ వాషింగ్టన్, మిల్టెనీ బయోటెక్ ఎండీ డాక్టర్ బోరిస్ స్టోఫెల్ తో పాటు పలువురు చర్చల్లో పాల్గొననున్నారు. కాగా, హైదరాబాద్ లో జరిగే బయో ఏషియా సదస్సు.. చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సదస్సుగా నిలుస్తుందని శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, ఆలోచనలన్నీ ఒకే వేదికపై పంచుకునే అరుదైన అవకాశాన్ని బయో ఏషియా అందిస్తుందన్నారు.