సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన అవసరం : డా.అంజనీదేవి

సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన అవసరం : డా.అంజనీదేవి

హనుమకొండ సిటీ, వెలుగు: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పై మహిళలకు అవగాహన అవసరమని హనుమకొండలోని కల్యాణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డా.అంజనీదేవి అన్నారు. కల్యాణి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సోమవారం డా.అంజనీదేవి ఆధ్వర్యంలో 15 మంది మహిళలకు హెచ్​పీవీ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా డా.అంజనీదేవి మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు.

దీనిపై అవగాహన లేకపోవడం వల్ల ఏటా దేశవ్యాప్తంగా చాలామంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారని పేర్కొన్నారు. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు హెచ్​పీవీ వ్యాక్సిన్ వేయించడం వల్ల 90 శాతం రక్షణ లభిస్తుందన్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు.