మావోయిస్టు కటకం సుదర్శన్  జీవిత చరిత్ర..  ఇంద్రవెల్లి ఉద్యమానికి నాయకత్వం

మావోయిస్టు కటకం సుదర్శన్  జీవిత చరిత్ర..  ఇంద్రవెల్లి ఉద్యమానికి నాయకత్వం

మంచిర్యాల/బెల్లంపల్లి/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అలియాస్​ దూల (69) మే 31న గుండెపోటుతో కన్నుమూశారు. ఈమేరకు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్, స్టేట్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ వేర్వేరుగా ఆదివారం ప్రకటనలు రిలీజ్ చేశారు. కొన్నేండ్లుగా లంగ్స్ ఇన్​ఫెక్షన్, బీపీ, షుగర్​తో సుదర్శన్​ బాధపడ్డారని వివరించారు. విప్లవ సంప్రదాయాలతో అంత్యక్రియలు పూర్తి చేశామని ప్రకటించారు.  జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా కటకం సుదర్శన్ స్మారక సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

విద్యార్థి దశలోనే విప్లవోద్యమం వైపు.. 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీకి చెందిన దివంగత కటకం మల్లయ్య, వెంకటమ్మ దంపతుల మొదటి సంతానం సుదర్శన్. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లున్నారు. సుదర్శన్ విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. బెల్లంపల్లిలో హైస్కూల్ విద్య, మంచిర్యాలలో డిగ్రీ పూర్తి చేశారు. మందమర్రి కేకే1 గనిలో కార్మికుడిగా పనిచేస్తూ మైనింగ్ డిప్లొమా చేసేందుకు హైదరాబాద్ వెళ్లారు. 1974–75లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్​యూ)లో యాక్టివ్​గా పనిచేశారు.

ఎమర్జెన్సీ టైంలో కీలక పాత్ర

ఎమర్జెన్సీ కాలంలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో సింగరేణి కార్మికులను, స్టూడెంట్స్​ను, రైతులను ఉద్యమం వైపు నడిపించారు. ఎమర్జెన్సీ ఎత్తేశాక 1978లో ‘గ్రామాలకు తరలండి’అంటూ పార్టీ ఇచ్చిన పిలుపుతో లక్షేట్టిపేట, జన్నారం ప్రాంతాల్లో ఆర్గనైజర్​గా పనిచేశారు. నాటి పీపుల్స్ వార్ గ్రూప్ అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, గజ్జెల గంగారాం, పెద్ది శంకర్, నల్లా ఆదిరెడ్డి, పల్లె కనుకయ్య, పులి మధునయ్య నాయకత్వంలో ఉద్యమాన్ని నడిపించారు. 1978 కాలంలో బెల్లంపల్లిలో కుందేళ్ల శంకర్, దస్తగిరి అనే గూండాల జంట హత్యల తర్వాత సుదర్శన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నాలుగున్నర దశాబ్దాలుగా ఇంటి ముఖం కూడా చూడలేదు.

ఇంద్రవెల్లి ఉద్యమానికి నాయకత్వం

1979లో నల్లా ఆదిరెడ్డి, కటకం సుదర్శన్, గజ్జల గంగారాంతో ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఏర్పడింది. 1981 ఏప్రిల్​20న జరిగిన ఇంద్రవెల్లి ఉద్యమానికి సుదర్శన్ నాయకత్వం వహించారు. 1985 వరకు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ సిర్పూర్, చెన్నూర్, తిర్యాణి, ఇంద్రవెల్లి దళాల నిర్మాణంలో కీలకంగా పనిచేశారు. 1985లో ఫారెస్ట్ లైజన్​కమిటీ సభ్యుడిగా నియమితులై 1995 దాకా కొనసాగారు. కొంతకాలం ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. సుదర్శన్ తన ఉద్యమ సహచరిణి లలిత అలియాస్ అరుణ అలియాస్ సాధనను దండకారణ్యంలోనే పెండ్లి చేసుకున్నారు. 2006లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం అగర్ గూడలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఆమె చనిపోయారు. ఆమెది జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రంగారావుపేట గ్రామం.

అంచెలంచెలుగా అత్యున్నత స్థానానికి

కటకం సుదర్శన్ 1995లో కొత్తగా ఏర్పడిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2001లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నియ్యారు. 2001 నుంచి 2017 దాకా సెంట్రల్ రీజినల్ బ్యూరో (సీఆర్బీ) సెక్రటరీగా ఉన్నారు. 2011, వెస్ట్ బెంగాల్​లో కిషన్ జీని హతమార్చిన తర్వాత 14 మంది సభ్యులతో ఏర్పడిన పొలిటికల్ బ్యూరోకు నాయకుడిగా వ్యవహరించారు. ఏపీ, తెలంగాణ నక్సల్స్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. ‘క్రాంతి’, ‘పీపుల్స్ మార్చ్’ పత్రికలను నడిపించారు. ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఉద్యమ స్థితి ప్రతిబింబించేలా ‘వసంత గీతం’ నవల రాశారు. ఇంద్రవెల్లి 40ఏండ్ల ఉద్యమ స్ఫూర్తిపై డాక్యుమెంట్ రాశారు.

ప్రజల కోసం పోరాడిండు : కటకం సతీశ్

నాలుగున్నర దశాబ్దాలుగా తన అన్న ఇంటి ముఖం చూడలేదని సుదర్శన్ తమ్ముడు సతీశ్ గుర్తు చేశారు. మొత్తం జీవితం ప్రజల కోసం త్యాగం చేశారని, ఆదివారం టీవీల్లో చూస్తేనే చనిపోయినట్లు తెలిసిందన్నారు. ఈ సందర్భంగా నివాళులర్పించారు. రాజకీయ నాయకులు, సింగరేణి కార్మికులు, బంధువులు, స్నేహితులు సతీశ్ ఇంటికొచ్చి సుదర్శన్​ ఫొటోకు పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.