నిరుపయోగంగా బయోమెట్రిక్ పరికరాలు

నిరుపయోగంగా బయోమెట్రిక్ పరికరాలు
  • సర్కారు జూనియర్ కాలేజీల్లో మాన్యువల్గానే హాజరు

హైదరాబాద్, వెలుగు: సర్కారు జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అటకెక్కింది. పర్యవేక్షించాల్సిన అధికారులే పట్టించుకోకపోవడంతో చాలా కాలేజీల్లో లెక్చరర్లు, సిబ్బంది టైమింగ్స్ పాటించట్లేదు. దీంతో కోట్లు పెట్టి కొన్న బయోమెట్రిక్ మెషిన్లు నిరుపయోగంగా మారాయి. 
ఇష్టమొచ్చిన టైమ్​కు వచ్చిపోతున్నరు..
రాష్ట్రంలో మొత్తం 405 సర్కారు జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో 2017లో లెక్చరర్లు.. సిబ్బందికి ఒకటి, స్టూడెంట్లకు మరొకటి చొప్పున కాలేజీకి 2 బయోమెట్రిక్ మెషిన్లు ఇచ్చారు. ఒక్కోకాలేజీలో 4 సీసీ కెమెరాలు పెట్టారు. కాలేజీ టైమింగ్స్ ప్రకారం రోజూ ఉదయం9.30 , సాయంత్రం 4గంటలకు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని అధికారులు అప్పట్లో ఆదేశాలు ఇచ్చారు. కొంతకాలం వీటిని బాగానే వినియోగించారు. ఆపై కరోనా కారణంగా బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం పక్కన పెట్టారు. ఆ తర్వాత వాటిలో కొన్ని పాడైనట్లు ప్రిన్సిపాల్స్ చెప్తున్నారు. వాటిని బాగుచేసేందుకు ఇంటర్ కమిషనరేట్ అధికారులు గానీ, కాలేజీ ప్రిన్సిపల్స్​గానీ దృష్టి పెట్టట్లేదు. బయోమెట్రిక్ పరికరాలు పనిచేస్తున్న కాలేజీల్లోనూ వాడకుండా పక్కన పడేశారు. దీంతో లెక్చరర్లు, సిబ్బంది ఏ టైమ్​కు వచ్చిపోతున్నారో క్లారిటీ లేకుండా పోయింది. వాళ్లకు నచ్చిన టైమ్​లో వచ్చిపోతున్నారనే ఆరోపణలున్నాయి.
ఇంటర్ కమిషనరేట్​లోనే అమలైతలే
బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంపై ఇంటర్ కమిషనరేట్ అధికారులే పట్టించుకోవట్లేదు. దీంతో జిల్లాస్థాయిలో డీఐఈవోలు, నోడల్ ఆఫీసర్లూ అదేబాటలో నడుస్తున్నారు. అయితే, ఇంటర్ బోర్డు, ఇంటర్ కమిషనరేట్​లోనూ సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయకపోవడం గమనార్హం. అదే కమిషనరేట్​భవనంలోనే కొనసాగుతున్న కాలేజీల కమిషనరేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్​లో మాత్రం బయోమెట్రిక్ అటెండెన్స్ కొనసాగుతోంది. వాటి పరిధిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల సిబ్బందికి కరోనా టైమ్​లోనూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. ఇంటర్ కాలేజీలు, కమిషనరేట్, ఇంటర్ బోర్డులో ఎందుకు అమలు చేయట్లేదో చెప్పాలని స్టూడెంట్ యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి.