హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్ సెట్ అప్లికేషన్ల ప్రక్రియలో స్టూడెంట్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంటర్ లో తాము చదివిన గ్రూప్ కు, ఎప్ సెట్ లో రాసే ఎగ్జామ్ కు సంబంధం లేకుండా ఆప్షన్లు ఇస్తున్నారు. ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తుల్లో బైపీసీ విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీం ఎంచుకోవాల్సి ఉండగా.. పొరపాటున ‘ఇంజనీరింగ్’ స్ట్రీమ్ కు అప్లై చేశారు.
ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తుల్లో 11 మంది బైపీసీ స్టూడెంట్లు ఈ తప్పు చేసినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు ఎంపీసీ విద్యార్థులు కూడా ఏడుగురు ఇంజనీరింగ్ కు బదులు ‘అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ’కి అప్లై చేశారు. ఎన్నిసార్లు చెబుతున్నా అభ్యర్థులు తప్పులు చేస్తూనే ఉన్నారని ఈప్ సెట్ కన్వీనర్ డాక్టర్ కె.విజయ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడంలో స్టూడెంట్లు అయోమయానికి గురికావొద్దని ఆయన సూచించారు. ఇప్పటివరకు వచ్చిన వాటిలో 52 అప్లికేషన్లలో అక్షర దోషాలు ఉన్నట్లు కన్వీనర్ తెలిపారు. అయితే, విద్యార్థి పేరు, డేటాఫ్ బర్త్ , మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, రిజర్వేషన్ క్యాటగిరీ (క్యాస్ట్) తదితర వాటిని తప్పుగా ఎంటర్ చేస్తున్నారని వివరించారు. అయితే, ‘ఫైనల్ సబ్మిట్’ కొట్టే ముందే ప్రివ్యూలో అన్ని వివరాలు సరిచూసుకోవాలని, లేదంటే హాల్ టికెట్లు వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుందని ఆయన హెచ్చరించారు.
