బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్: తగ్గిన చికెన్ రేట్లతో వ్యాపారుల ఆందోళన

బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్: తగ్గిన చికెన్ రేట్లతో వ్యాపారుల ఆందోళన

బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో చికెన్‌ అమ్మకాలపై  పడింది. రాష్ట్రంలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ కేసు నమోదు కాకపోయినా కొనుగోలు దారులు మాత్రం చికెన్‌ తినేందుకు వెనుకాడుతున్నారు. దీంతో చికెన్‌ ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. నెల రోజుల కిందట కిలో చికెన్‌ ధర 220 రూపాయలు కాగా ప్రస్తుతం కిలో 140 నుంచి 150 రూపాయలకు పడిపోయింది.  అంతేకాదు ఫామ్‌ల దగ్గర ఒక్కో కోడి ధర 60 నుంచి 70రూపాయలకు పడిపోయింది. దీంతో జాతీయ ఆహార సంస్ధ తాజాగా కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఇందులో చికెన్‌ తినడంతో బర్డ్‌ఫ్లూ రాదని స్పష్టం చేసింది. అయితే మాంసాన్ని బాగా ఉడిగికించి తినాలని, కోడిగుడ్లను హాఫ్‌ బాయిల్డ్‌ తినకూడదని నిబంధనల్లో స్పష్టం చేసింది.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని… నిరభ్యంతరంగా చికెన్‌ తిన వచ్చని ప్రభుత్వం చెబుతోంది. పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ చికెన్‌ను తినవచ్చని అధికారులు తెలిపారు. ప్రభుత్వం, ఆయాశాఖల అధికారులు ఎంత చెప్పినా ప్రజల్లో ఇంకా భయం పోలేదు. దీంతో రోజు రోజుకూ ధరలు పడిపోతున్నాయి. దీంతో పౌల్ర్టీ రంగాన్నినమ్ముకున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.