రాష్ట్రంలో ‘బిల్లా -రంగా’ల పొలిటికల్ డ్రామా : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 

రాష్ట్రంలో ‘బిల్లా -రంగా’ల పొలిటికల్ డ్రామా : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు దక్కాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలను గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు గాలికొదిలేశాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో ‘బిల్లా రంగా’ సినిమాలను తలపించేలా రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు అధికార దాహం ఉంటే, చేసిన అవినీతి నుంచి తప్పించుకోవాలనే తాపత్రయం బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఉందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ. 8.2 లక్షల కోట్ల అప్పు చేస్తే, అధికారంలోకి వచ్చిన కేవలం ఏడు నెలల్లోనే కాంగ్రెస్ మరో రూ. 4 లక్షల కోట్ల అప్పు చేసిందని మండిపడ్డారు. ఇంత అప్పు తెస్తున్నా ఉద్యోగులకు పీఆర్సీ, పీఎఫ్ బకాయిలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.

సింగరేణికి రూ. 59 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు రూ. 12 వేల కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టి విద్యార్థులు, కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మోకాళ్లపై కూర్చుని హామీలిచ్చిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ‘ఎండ్రిన్ తాగినా ఉద్యోగాలు ఇవ్వను’ అని సీఎం అనడం యువతను అవమానించడమేనన్నారు.