అరెస్టులు, ఆందోళనలతో అట్టుడికిన ఓరుగల్లు

అరెస్టులు, ఆందోళనలతో  అట్టుడికిన ఓరుగల్లు

వరంగల్, వెలుగుబీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ ఆందోళనలతో ఓరుగల్లును హోరెత్తించారు. పోలీసులు నిర్బంధించినా, ముందస్తు అరెస్టులు చేసినా వారిని తప్పించుకుని నిరసనలు కొనసాగించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌పై టీఆర్ఎస్ దాడికి నిరసనగా బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో వందలాది నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళనలు చేశారు. ఉదయం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇంటి వద్ద బీజేవైఎం నాయకులు, సాయంత్రం తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. వీరిని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ క్యాడర్ రోడ్డెక్కడంతో రోజంతా నిరసనలు, అరెస్టులతో ఓరుగల్లు పోరుగల్లును తలపించింది.

ర్యాలీగా వెళ్తుంటే అడ్డుకుని..

ఆదివారం మధ్యాహ్నం ఎంపీ అర్వింద్‌‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడంపై బీజేపీ నేతలు, క్యాడర్ ఆగ్రహంతో ఉన్నారు. దీంతో సోమవారం ఉదయమే పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ లీడర్లను ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు శాంతియుత ర్యాలీగా వెళ్లి అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించాలని భావించి బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కాలినడకన కలెక్టరేట్‌‌కు బయల్దేరారు. అప్పటికే పోలీసులు పార్టీ ఆఫీస్‌‌కు చేరుకొని వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న రావు పద్మ తదితరులు అమరవీరుల స్తూపం వైపు వెళ్లగా, మార్గమధ్యలో అడ్డుకొని అరెస్టు చేశారు. ఆమెతోపాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకొని భీమారంలోని శ్రీశుభం గార్డెన్స్కు తరలించారు.

దిష్టిబొమ్మతో టీఆర్ఎస్ కార్యకర్తల హల్‌‌చల్‌‌

బీజేపీ నాయకులు అదాలత్ సెంటర్లో ఆందోళన చేస్తుండగా.. అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మతో అమరవీరుల స్తూపం వైపు దూసుకొచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కొంతమంది అమరవీరుల స్తూపం వైపు దూసుకెళ్లారు. ఓవైపు బీజేపీ నాయకుల అరెస్టులు.. మరోవైపు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు దిష్టిబొమ్మతో రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో టీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో వారిని అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు.

హత్యాయత్నం కాదా?: రావు పద్మ

ఎంపీ అర్వింద్ పై ప్లాన్ ప్రకారమే దాడి చేశారని బీజేపీ వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. ఎంపీపై పోలీసుల సమక్షంలో దాడి జరగడం హత్యాయత్నం కాదా అని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కింద కేసు పెట్టాలని, పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎక్కడికక్కడ అరెస్టులు

ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బీజేపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. హన్మకొండ బాలసముద్రంలోని ఏబీవీపీ ఆఫీస్ నుంచి బయల్దేరిన కొంతమంది నాయకులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో పార్టీ వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, దశ్మంత్ రెడ్డి, యుగంధర్, భాస్కర్రెడ్డి, రామచంద్రారావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, నేతలు ఎడ్ల అశోక్రెడ్డి, కేవీఎల్ఎన్ రాజు తదితరులు ఉన్నారు. రాష్ట్ర నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, కిషన్, అమరేందర్ రెడ్డి, కేశవ రెడ్డి, జిల్లా పదాధికారులు సంతోష్ రెడ్డి, జగదీశ్, సురేష్, రాజేంద్ర ప్రసాద్, హరిశంకర్, సదానందం తదితరులను అరెస్టు చేశారు.

చీఫ్‌‌ విప్‌‌ ఇంటి వద్ద..

బీజేపీ ఆందోళన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ క్యాంపు ఆఫీస్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌‌రెడ్డి ఆధ్వర్యంలో కొందరు నేతలు చీఫ్ విప్ ఇంటి ముట్టడికి బయల్దేరగా అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాకేశ్‌‌రెడ్డిని అరెస్టు చేసి వేరే చోటుకు తరలించారు. ఎంపీ అర్వింద్ పై దాడికి నిరసనగా బీజేవైఎం నాయకులు.. వినయ్ భాస్కర్ ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు.  రూరల్ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు రవికిరణ్, అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహరి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం నన్నపనేని నరేందర్ ఇంటి వద్ద కూడా బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.  అక్కడ 8 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు  పోలీసులు చెప్పారు.

 

కరోనా కట్టడిలో కేసీఆర్ ఫెయిల్ ఐతే పాసైందెవరు?