- పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: దేశ ప్రజల్లో అయోధ్య రాముడిపై ప్రజలకు ఉన్న అపారమైన భక్తి, విశ్వాసాలను బీజేపీ నేతలు వమ్ము చేశారని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. రూ.200 కోట్ల రాముడి సొమ్మును నిలువునా దోచుకున్న తీరుపై బీజేపీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై కేవలం ముగ్గురు సభ్యులతో సిట్ వేసినంత మాత్రాన నిజాలు బయటకు రావని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందనేది ఇప్పుడు దేశ ప్రజలకు అర్థమవుతోందని, రాముడిపై అసలైన ప్రేమ ఆ పార్టీకి లేదనేది ఈ ఘటనతో స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
