శివసేన సర్కారుకు షాకిచ్చిన బీజేపీ

శివసేన సర్కారుకు షాకిచ్చిన బీజేపీ
  • శివసేన సర్కారుకు షాకిచ్చిన బీజేపీ
  • 3 రాజ్యసభ సీట్లు కైవసం.. 
  • కాంగ్రెస్,సేన,ఎన్సీపీకి చెరొక సీటు

ముంబై/చండీగఢ్: మహారాష్ట్రలో శివసేన ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ షాకిచ్చింది. ఆరు రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో 3 సీట్లను గెలుచుకుంది. రెండు సీట్లకే మెజారిటీ ఉన్నప్పటికీ.. మూడో సీటులోనూ అభ్యర్థిని నిలబెట్టి విజయం సాధించింది. అధికార మహా వికాస్ ఆఘాడీ కూటమి మూడు సీట్లు గెలుచుకుంది. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అనీల్ బోండే, ధనంజయ్ మహాదిక్, శివసేన నుంచి సంజయ్ రౌత్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నుంచి ఇమ్రాన్ ప్రతాప్‌‌గర్హి గెలిచారు. మొత్తం 284 ఓట్లు పోల్ కాగా.. గోయల్‌‌కు 48, బోండేకి 48, మహాదిక్‌‌కి 41.56, రౌత్‌‌కి 41, ప్రతాప్‌‌గర్హికి 44, ప్రఫుల్ పటేల్‌‌కు 43 వచ్చాయి. 

పట్టుబట్టి గెలిపించుకున్న ఫడ్నవీస్
ప్రస్తుతం ఖాళీ అయిన 6 రాజ్యసభ సీట్లలో రెండు చోట్ల బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. మరో సీటు దక్కించుకునేందుకు కొన్ని ఓట్లు తక్కువ పడతాయి. మరో మూడు సీట్లలో మహా వికాస్ ఆఘాడీ కూటమికి మెజారిటీ ఉంది. దీంతో ఆరో సీటు ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఏకగ్రీవం పేరుతో తమ ప్రత్యర్థికి ఇంకో సీటు ఇచ్చేందుకు బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఒప్పుకోలేదు. ఆరో సీటు నుంచి ధనంజయ్ మహాదిక్‌‌ను బీజేపీ, సంజయ్ పవార్‌‌‌‌ను శివసేన బరిలో దింపాయి. హోరాహోరీగా జరిగిన పోరులో మహాదిక్ విజయం సాధించారు. తాను పట్టుబట్టినట్లుగానే మూడు సీట్లను ఫడ్నవీస్ దక్కించుకున్నారు. ఫడ్నవీస్ అద్భుతం చేశారని ఎన్సీపీ చీఫ్​ శరద్ పవార్‌‌‌‌ కూడా మెచ్చుకున్నారు.

పరస్పర ఫిర్యాదులు.. 8 గంటల ఆలస్యం
బీజేపీ, అధికార మహా వికాస్ ఆఘాడీ కూటమి పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ 8 గంటలు ఆలస్యంగా మొదలైంది. నిబంధనలు ఉల్లంఘించారని రెండు పక్షాలు కంప్లయింట్లు చేశాయి.

హర్యానాలోనూ..
హర్యానాలో రెండు సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ హవానే నడిచింది. బీజేపీ అభ్యర్థి కృష్ణన్ లాల్ పన్వార్, బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర​అభ్యర్థి కార్తికేయ శర్మ విజయం సాధించారు. ఇక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ 7 గంటలు ఆలస్యంగా మొదలైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక లెక్కింపు షురూ కాగా, శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్‌‌కు పాల్పడ్డారని, మరో ఎమ్మెల్యే ఓటు చెల్లదని ఈసీ ప్రకటించిందని, దీంతో అజయ్ మాకెన్ ఓడిపోయారని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. కృష్ణన్ లాల్ పన్వార్‌‌‌‌కు 36 ఓట్లు, కార్తికేయ శర్మకు 29.6 ఓట్లు, అజయ్‌‌ మాకెన్‌‌కు 29 ఓట్లు పడ్డాయని రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్కే నందాల్ చెప్పారు.