
- = బీసీ రిజర్వేషన్లు, హామీల అమలే కాంగ్రెస్ ఎజెండా
- = కాంగ్రెస్ బాకీ కార్డ్ లతో జనంలోకి బీఆర్ఎస్
- = ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతామన్న కారు పార్టీ
- = ఎంపీ ఎన్నికల ఓటు షేర్ పెరుగుతుందని బీజేపీ భరోసా
- = ప్రతి సీట్ కూ పోటీ చేస్తామంటున్న కమలనాథులు
హైదరాబాద్: స్థానిక సమరానికి పార్టీలు సై అంటున్నాయి. ఐదు విడుతల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికకు పార్టీలు ఇప్పటికే సంసిద్ధతను ప్రకటించాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అటు రాజకీయ పార్టీలు సైతం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్‌కు పంపింది.
2018 పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. దానిని గవర్నర్‌కు పంపింది. గవర్నర్ నుంచి రిప్లయ్ రాకపోవడం, హైకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌కు పోలింగ్ నిర్వహణపై సంసిద్ధతను తెలిపింది. దీంతో ఇవాళ షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచే షెడ్యూల్ అమల్లోకి వచ్చింది. సామాజిక న్యాయానికి తామే చాంపియన్ అనే నినాదాన్ని బలంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రారంభించనుంది.
అదే విధంగా ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500 కేగ్యాస్, 200 యూనిట్లలో పు విద్యుత్ వినియోగించే ఇండ్లకు ఉచితంగా కరెంటు సరఫరాతోపాటు రుణమాఫీ, రైతు భరోసా అంశాలను ప్రధానంగా ప్రస్తావించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార పార్టీకి కౌంటర్‌గా కాంగ్రెస్ బాకీ కార్డుల పేరుతో జనంలోకి వెళ్లనుంది. ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదంటూ ప్రజల్లోకి వెళ్లనుంది.
ఇందుకోసం ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డును అందించనుంది. దీంతో పాటు సర్కారు వైఫల్యాలను, యూరియా కొరతను ఓట్లుగా మార్చుకొనేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను స్వాగతిస్తున్నట్టు బీజేపీ చెబుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటోంది.
పార్టీ సంస్థాగతంగా ఇప్పటికే రెడీ అయ్యింది. బూత్ నుంచి స్టేట్ స్థాయి వరకు వర్క్ షాపులను సైతం నిర్వహించుకుంది. మహాసంపర్క్ అభియాన్ పేరుతో ఇప్పటికే కేంద్రం పథకాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యూరియా కొరత, హామీల అమలులో జాప్యంపై ఇప్పటికే ప్రచారం చేసినట్టు చెబుతున్నారు.
రామచందర్ రావు స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాక మొదటి ఎన్నికలు కావడంతో బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. స్థానిక సంస్థల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతారని బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఓటు షేర్ కంటిన్యూ అవుతుందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా వారంటున్నారు.