మోదీ 12 ఏళ్ల పాలన సందర్భంగా బీజేపీ సంబురాలు

మోదీ 12 ఏళ్ల పాలన సందర్భంగా బీజేపీ సంబురాలు
  • జూన్ 2 నుంచి విస్తృత సేవా కార్యక్రమాలు 
  • బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు 

హైదరాబాద్, వెలుగు: ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులు విస్తృత సేవా, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ‘విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం’  అనే థీమ్‌‌తో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 2 న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బూత్, జిల్లా, స్టేట్ ఆఫీసుల్లో జాతీయ జెండా ఆవిష్కరణతో వేడుకలు మొదలవుతాయని ఆయన తెలిపారు.

జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ నినాదంతో ప్రతి కార్యకర్త ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. జూన్ 11, 12న జిల్లా స్థాయిలో మీడియా సమావేశాలు, ప్రత్యేక ఎగ్జిబిషన్లు నిర్వహిస్తామన్నారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సులు, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై పార్లమెంట్ స్థాయి సెమినార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యువమోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో 500 మంది ప్రముఖులను కలిసి ‘వికసిత్ భారత్’ సంకల్పంపై వారిని సన్మానించాలని నిర్ణయించారు.