- సీఎం యూఎస్ పర్యటనకు కేంద్రం బ్రేక్ సరైన నిర్ణయమే: రాంచందర్ రావు
- పాక్ అనుకూల వ్యక్తితో భేటీపై నిజం చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: భారత వ్యతిరేక వైఖరి కలిగిన న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీని కలవాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. సీఎం అమెరికా పర్యటన వెనుక అసలు కథ ఏంటో తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించడం సరైన చర్య అని రాంచందర్రావు అభిప్రాయపడ్డారు. భారత వ్యతిరేక శక్తుల ప్రతినిధులను, రాహుల్ గాంధీకి సైద్ధాంతిక గురువులుగా ఉన్న వ్యక్తులను కలిసేందుకే ఈ పర్యటన తలపెట్టారనే విషయం స్పష్టమవుతోందన్నారు.
ప్రతిపాదిత పర్యటనలో జొహ్రాన్ మమ్దానీతో భేటీ ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఆ వివరాలను అధికారిక షెడ్యూల్‌లో ఎందుకు దాచారని, ఆ భేటీతో రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. మమ్దానీ భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన పాకిస్థాన్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారని తెలిపారు. 2020లో అయోధ్య రామమందిర భూమిపూజను వ్యతిరేకిస్తూ టైమ్స్ స్క్వేర్‌లో హిందూ వ్యతిరేక నినాదాలతో నిరసన చేశారని గుర్తుచేశారు. గత ఏడాది ప్రధాని మోదీ అమెరికా పర్యటనను బహిరంగంగా వ్యతిరేకించిన వ్యక్తిని సీఎం కలవాలనుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సైతం జొహ్రాన్ మమ్దానీ తీరును తప్పుపట్టారని తెలిపారు. సొంత పార్టీ సీనియర్ నేతలే మమ్దానీని పాకిస్థాన్ ఏజెంట్‌గా అభివర్ణిస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డికి ఆయనపై ఎందుకు అంత ప్రేమ అని నిలదీశారు.
