బెంగాల్ లో ప్రజాస్వామ్యం గెలిచింది..కుటుంబ పార్టీల వినాశనం మొదలైంది: రాంచందర్ రావు  

బెంగాల్ లో ప్రజాస్వామ్యం గెలిచింది..కుటుంబ పార్టీల వినాశనం మొదలైంది: రాంచందర్ రావు  
  • టీఎంసీ హింసా రాజకీయాలకు ప్రజలు చెంపపెట్టు తీర్పిచ్చారని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కుటుంబ పాలనకు, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. టీఎంసీ గత 15 ఏండ్లుగా హింసను ప్రేరేపిస్తూ, బంగ్లాదేశీయులు, రోహింగ్యాల దొంగ ఓట్లతో అధికారాన్ని చెలాయించిందని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు టీఎంసీకి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు.

సోమవారం హైదరాబాద్‌‌లో బీజేపీ స్టేట్ ఆఫీసులో పలువురు డాక్టర్లు, మైనారిటీలు బీజేపీలో చేరారు. వారందరికీ రాంచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్​లో ప్రధాని మోదీ నాయకత్వం, అమిత్ షా వ్యూహరచన ఈ విజయానికి నాంది పలికాయని ఆయన విశ్లేషించారు. అస్సాంలో కూడా కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టి ప్రజలు మళ్లీ బీజేపీని అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. బీజేపీపై కొన్ని పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఏ మతానికీ, ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్నదే తమ నినాదమని వెల్లడించారు. మైనారిటీలను పార్టీకి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు సహకరించి ఉంటే, ప్రస్తుతం ఎందరో ముస్లిం మహిళలు చట్టసభల్లో ఉండేవారని రాంచందర్ రావు అన్నారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు కేవలం తామే అధికారంలో ఉండాలనే స్వార్థంతో మహిళలకు రాజకీయ అవకాశాలు దక్కకుండా అడ్డంకులు సృష్టించారని ఆయన విమర్శించారు.