హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యం గనుక లేకపోతే, కాంగ్రెస్ విధేయులు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన ఇంటి నుంచి పార్లమెంటు వరకు బంగారు రథంపై మోసుకెళ్లేవారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోలను జత చేస్తూ ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ప్రధాని కావాలని రాహుల్ మూడుసార్లు ప్రయత్నిస్తే.. ప్రతిసారీ ప్రజలు ఆయన్ను పూర్తిగా తిరస్కరించారని పేర్కొన్నారు.
ప్రజలు పదే పదే ఆయన నాయకత్వాన్ని వద్దంటున్నా.. మళ్లీ ఏ మొహం పెట్టుకొని దేశం కోసం తాను పీఎం పదవిని స్వీకరించడానికి సిద్ధం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఇష్టాయిష్టాల కంటే ప్రజల అభీష్టమే అత్యంత కీలకమని రాంచందర్ రావు చెప్పారు.
