రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో   బీజేపీదే గెలుపు..పట్టభద్రుల ఓట్ల నమోదుపై కార్యకర్తలు కసిగా పనిచేయాలి: రాంచందర్రావు 

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో   బీజేపీదే గెలుపు..పట్టభద్రుల ఓట్ల నమోదుపై కార్యకర్తలు కసిగా పనిచేయాలి: రాంచందర్రావు 
  • కేంద్రంపై ఓట్ చోరీ ప్రచారం వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: రాబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తమ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు స్థానాలను గెలుచుకుంటే రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పంజాబ్, కేరళతో పాటు హైదరాబాద్‌‌లోని  పలు విద్యార్థి సంఘాల ఎన్నికల్లో జాతీయ భావజాల నేతలే విజయం సాధించారని, దేశవ్యాప్తంగా యువతలో జాతీయవాదం పెరిగిందని రాంచందర్ రావు చెప్పారు.

మోదీ ప్రభుత్వానికి ప్రజాదరణను చూసి ఓర్వలేకే కొందరు 'ఓట్ చోరీ' అంటూ విదేశీ శక్తుల ప్రోత్సాహంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బిహార్, మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ స్థానం నుంచి గతంలో వీ.రామారావు, ఎల్ఎస్ రాజు, టి. రాజేశ్వరరావు వంటి ప్రముఖులు గెలిచారని.. గతంలో ఈ స్థానంలో బీజేపీ 23 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఘన చరిత్ర ఉందని గుర్తుచేశారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ రూ.200 కోట్లకు పైగా ఖర్చు పెట్టినా తాము అతి తక్కువ తేడాతోనే ఓడిపోయామని వివరించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఆగ్రహం

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను ప్రజలు చూశారని.. ఆ రెండు పార్టీల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని రాంచందర్ రావు అన్నారు. ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని, గతంలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారాన్ని దుర్వినియోగం చేసే అలవాటు ఉందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలను ఎదుర్కొంటూ కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

అభ్యర్థులు ఎవరైనా సరే.. బీజేపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. విద్యావంతుల్లో అధిక శాతం బీజేపీకి మద్దతుగా ఉన్నప్పటికీ, ఓటు నమోదు, పోలింగ్ రోజు ఓటు వేసే విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉంటున్నారనీ..వారిని గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించడంలో కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. ఈ ఎన్నికలను మన భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటంగా భావించి, కసిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్య పాల్గొన్నారు.