సర్ పేరుతో సెక్యులర్ ఓట్ల తొలగింపుకు బీజేపీ కుట్ర..అందులో భాగంగానే మోదీ రాష్ట్ర పర్యటన: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

సర్ పేరుతో సెక్యులర్ ఓట్ల తొలగింపుకు బీజేపీ కుట్ర..అందులో భాగంగానే మోదీ రాష్ట్ర పర్యటన: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • ప్రధాని వస్తే కావాల్సినవి అడగరా?
  • 8 మంది బీజేపీ ఎంపీల సోయి ఎటు పోయిందని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: బెంగాల్ మాదిరిగానే తెలంగాణలో నూ ‘సర్’ పేరుతో సెక్యులర్ ఓట్లను తొలగించి గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్ ఆరోపించారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారని పేర్కొన్నారు. బుధవారం గాంధీభవన్ లో మీడియాతో మహేశ్​గౌడ్ చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఓటరు తమ ఓటును కాపాడుకోవాలని ఆయన సూచించారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తే.. రాష్ట్రానికి కావాల్సినవి అడిగే సోయి ఇక్కడి 8 మంది బీజేపీ ఎంపీలకు లేదా? అని ప్రశ్నించారు.

ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండడంతోనే మోదీ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రానికి తానుపెద్దన్న అనే విషయం మర్చిపోయి మోదీ ఇక్కడ అధికారంలోకి వస్తామని అనడాన్ని ఆయన తప్పుపట్టారు. సీఎంగా కేసీఆర్ ను తాము ఎప్పుడూ అగౌరవపరచలేదని.. కానీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కేటీఆర్ భాష చెత్తగా ఉంటుందన్నారు.  రాష్ట్రంలో నామినేటెడ్ పదవులను తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలకు ఇచ్చామని.. పాత, కొత్త నేతల మధ్య వివాదం లేకుండా 80 శాతం పదవులు పాత వారికి, 20 శాతం పదవులు కొత్త వారికి ఇవ్వాలనే నిబంధనను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పొదుపు చర్యలు చేపట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మహేశ్​గౌడ్ ​తెలిపారు. అయితే, పొదుపు చేయాల్సిందల్లా కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 

భగీరథ్ ​విషయంలో చిత్తశుద్ధితో ఉన్నం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే వ్యవహరిస్తుందని, ఇందులో మైనర్ బాలికకు న్యాయం జరగాల్సిందేనని మహేశ్​గౌడ్ స్పష్టం చేశారు. ‘తప్పు చేసినప్పుడు ఎవరి కొడుకు అయినా సరే అరెస్టు కావాల్సిందే, శిక్ష పడాల్సిందే’అని అన్నారు. ఈ కేసులో భగీరథ్ ను రక్షించాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. బీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కేసును వాడుకుంటుందని ఆరోపించారు. తమకు బండి సంజయ్ అయినా కిషన్ రెడ్డి అయినా ఒక్కటేనని అన్నారు. బీజేపీలో ఉన్న గ్రూపులు ఇతర ఏ పార్టీలో లేవన్నారు. కమ్యునిస్టులకు కాలం చెల్లిందనుకోవడం పోరపాటేనని, వారికి ప్రజల మద్దతు ఉందన్నారు.