
బషీర్‌బాగ్, వెలుగు: జీహెచ్ఎంసీ సర్కిల్14 ఉద్యోగులపై జాంబాగ్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రాకేశ్జైస్వాల్ దాడిచేశారు. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతు శనివారం సర్కిల్ ఆఫీసుకు తాళాలు వేసి ఉద్యోగులు నిరసన తెలిపారు. శుక్రవారం సాయంత్రం విధుల్లో ఉన్న తనపై, చైన్ మెన్ ఆరిఫ్ పై అకారణంగా కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్ దాడికి పాల్పడ్డారని సెక్షన్ ఆఫీసర్ నరేశ్తెలిపారు. ఎందుకు దాడి చేశారని టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంజుల సింగ్ ప్రశ్నించగా, ఆమెను అసభ్య పదజాలంతో దూషించారని చెప్పారు.
కొంత కాలంగా సొంత పనుల కోసం కార్పొరేటర్ తమపై ఒత్తిడి చేస్తున్నారని.. ఆయన చెప్పినట్లు వినకపోవడంతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కార్పొరేటర్ ను వెంటనే అరెస్టు చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఏసీపీ మంజుల సింగ్ ఆధ్వర్యంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి, కార్పొరేటర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో రాకేశ్జైస్వాల్ పై కేసు నమోదైంది.
ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించి, దాడికి పాల్పడ్డారని అబిడ్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్‌చేశారు. కాగా బాధిత టౌన్ ప్లానింగ్ అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హెడ్డాఫీసుకు పిలిపించుకుని మాట్లాడారు. కార్పొరేటర్దాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే అబిడ్స్పోలీసులతో మాట్లాడారు.