ఆర్‌ఎస్‌ఎస్‌పై విషం కక్కుతున్నరు: ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఎదురు దాడి

ఆర్‌ఎస్‌ఎస్‌పై విషం కక్కుతున్నరు: ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఎదురు దాడి

న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ వల్లే దేశంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. దేశంలో ఆ సంస్థను బ్యాన్ చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్‎ను బ్యాన్ చేయాలని ఖర్గే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

దశాబ్దాలుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని విస్మరించిన కాంగ్రెస్ రాజకీయ మైలేజ్ కోసమే ఆయన పేరును ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై దాడి చేయడానికే కాంగ్రెస్ వల్లభాయ్ పేరు వాడుకుంటుందని ఫైర్ అయ్యారు. ఐఎన్‌సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని..ఇండియన్ నాజీ కాంగ్రెస్‌ అని అభివర్ణించారు. కర్నాటకలో ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసినప్పటికీ.. కోర్టు ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధాన్ని ఎత్తివేసిందని గుర్తు చేశారు. 

ఆర్‌ఎస్‌ఎస్ ఒక రాజకీయేతర సంస్థ అని.. ప్రభుత్వ ఉద్యోగులు ఆ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని న్యాయస్థానం స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ఆర్ఎస్ఎస్‎పై కోర్టు నిషేధం ఎత్తివేయడంతో కాంగ్రెస్‎కు చాలా అసహనంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ, ఎంఐఎం అల్లర్లకు మద్దతు ఇస్తున్నారని.. కానీ దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌పై విషం కక్కుతున్నారని నిప్పులు చెరిగారు. 

దేశంలో RSS బ్యాన్ చేయాలి: ఖర్గే

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేళ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో శాంతిభద్రతల సమస్యలు బీజేపీ-ఆర్ఎస్ఎస్ కారణంగానే తలెత్తుతున్నాయని ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకు దేశంలో ఆర్ఎస్ఎస్‎పై నిషేధం విధించాలని అన్నారు. ప్రధాని మోడీకి సర్ధార్ వల్లభాయ్ పటేల్‎పై నిజంగా గౌరవం ఉంటే ఈ పని చేయాలని సవాల్ విసిరారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఖర్గే పేర్కొన్నారు. 

శుక్రవారం (అక్టోబర్ 31) భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 41వ వర్ధంతి కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ.. మహాత్మ గాంధీ హత్యతో ఆర్ఎస్ఎస్‎కు సంబంధం ఉందని.. ఈ మేరకు గాంధీ హత్య తర్వాత 1948లో శ్యామా ప్రసాద్ ముఖర్జీకి అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ రాసిన లేఖను ఖర్గే ప్రస్తావించారు.  గాంధీ హత్యలో సంఘ్ అనుమానాస్పద కార్యకలాపాలను తన మంత్రిత్వ శాఖ గుర్తించిందని సర్దార్ పటేల్‎లో లేఖలో పేర్కొన్నారని గుర్తు చేశారు. గాంధీ హత్య తర్వాత దేశంలో సంవత్సరం పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ను పటేల్ నిషేధించారని, దేశ లౌకిక ప్రయోజనాల కోసం ఆయన ఈ చర్య తీసుకున్నారని తెలిపారు.