బెంగాల్‌‌‌‌లో జోయ్‌‌‌‌ మా కాళీ పేరుతో..ఇంటింటికీ మోదీ లేఖ

బెంగాల్‌‌‌‌లో జోయ్‌‌‌‌ మా కాళీ పేరుతో..ఇంటింటికీ మోదీ లేఖ
  • ఓటర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త వ్యూహం
  • ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనూ లెటర్‌‌‌‌‌‌‌‌ హిందీ వెర్షన్‌‌‌‌ షేర్​
  • అధికార టీఎంసీపై లేఖలో విమర్శలు

న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్‌‌‌‌లో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ బెంగాలీ భాషలో రాసిన ‘జోయ్ మా కాళీ’ లేఖ ఇప్పుడు రాష్ట్రంలో ఇంటింటికీ పంపిణీ అవుతున్నది. దీనికి సంబంధించిన హిందీ వెర్షన్‌‌‌‌ను కూడా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఆ పార్టీ షేర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నది.  ఈ లేఖలో ప్రధాని మోదీ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 

బెంగాల్  వెనుకబాటుతనానికి మమతా బెనర్జీ ప్రభుత్వమే కారణమని, ‘సోనార్ బంగ్లా’ (బంగారు బెంగాల్) ప్రజలను ఆ పార్టీ వంచించిందని అన్నారు.  బెంగాల్‌‌‌‌లోకి పొరుగు దేశాల (ప్రధానంగా బంగ్లాదేశ్) నుంచి అక్రమంగా చొరబడుతున్న వారిని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమతా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. 

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం గురించి లేఖలో ప్రస్తావించారు. బెంగాల్‌‌‌‌లో బీజేపీ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌‌‌‌ నుంచి మతపరమైన వేధింపుల వల్ల భారత్‌‌‌‌కు వచ్చిన ముస్లిమేతర వలసదారులందరికీ పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అభివృద్ధికి టీఎంసీ అడ్డంకులు.. 

కేంద్ర ప్రభుత్వం గత 11 ఏండ్లుగా రైతులు, యువత, మహిళలు, పేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ, బెంగాల్ ప్రభుత్వం వాటికి సహకరించలేదని ప్రధాని మోదీ లేఖలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నప్పటికీ.. జన్ ధన్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్‌‌‌‌లాంటి కేంద్ర పథకాల ప్రయోజనాలు బెంగాల్‌‌‌‌లోని లక్షలాది మందికి చేరాయని పేర్కొన్నారు. ‘‘అక్రమ చొరబాట్లు, మహిళలపై జరుగుతున్న హింసతో బెంగాల్‌‌‌‌ ప్రతిష్ట మసకబారింది. 

ఈ రాష్ట్రం సంకుచిత ఓటు బ్యాంకు రాజకీయాలు, హింస, అరాచకత్వంలో చిక్కుకున్నది. నకిలీ ఓటర్ల ప్రాబల్యం పెరుగుతున్నది. మనం అక్రమ చొరబాట్ల నుంచి విముక్తి పొంది, సుపరిపాలనను సాధించాలి” అని అన్నారు. ఈ లేఖను కాళీ మాత ప్రార్థనతో ప్రారంభించిన ప్రధాని.. నేతాజీ సుభాష్  చంద్రబోస్, డాక్టర్ శ్యామ్‌‌‌‌ ప్రసాద్ ముఖర్జీలాంటి మహనీయుల వారసత్వాన్ని గుర్తు చేస్తూ బెంగాల్‌‌‌‌కు ‘కొత్త దిశ’ అవసరమని పిలుపునిచ్చారు. కాగా, ఈ లేఖపై మమతా బెనర్జీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇంకా స్పందించలేదు.