
న్యూఢిల్లీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఎంపికను ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్నది. పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత ఈ మేరకు నడ్డాకు బాధ్యతను అప్పగించింది. తెలంగాణతో పాటు ఎనిమిది రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికలకు అభ్యర్థులను ఆయన రెండు రోజుల్లో ఫైనల్ చేయనున్నారు. ఆదివారం ఢిల్లీ దీన్ దయాళ్ మార్గ్‌లోని బీజేపీ హెడ్ ఆఫీసులో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ భేటీలో పార్టీ చీఫ్ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, ఎంపీ లక్ష్మణ్, బోర్డు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ప్రధానంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలపైనే కమిటీలో సుదీర్ఘంగా చర్చించారు. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. అయితే, జూబ్లీహిల్స్ సహా ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చ జరగలేదని, అభ్యర్థుల ఎంపికను నడ్డాకు అప్పగించారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అభ్యర్థులపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందన్నారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, పద్మ పేర్లతో కూడిన లిస్టును పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు శనివారం పార్టీ అధిష్టానానికి అందించారు. మాధవీలత పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలిసింది. అయితే, పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో చర్చించిన తర్వాతే అభ్యర్థిని నడ్డా ఫైనల్ చేయనున్నట్టు సమాచారం.