రాజాసింగ్‌‌‌‌‌‌‌‌పై సస్పెన్షన్ ఎత్తివేత .. బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం ప్రకటన

రాజాసింగ్‌‌‌‌‌‌‌‌పై సస్పెన్షన్ ఎత్తివేత .. బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం ప్రకటన
  • వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గతేడాది ఆగస్టులో సస్పెన్షన్
  • షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వడంతో తిరిగి పార్టీలోకి

హైదరాబాద్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ హైకమాండ్ సస్పెన్షన్ ఎత్తివేసింది. ఆదివారం ఈ మేరకు బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం మెంబర్ సెక్రటరీ ఓం పాఠక్ ప్రకటన విడుదల చేశారు. షోకాజ్ నోటీసుపై రాజాసింగ్ ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందిందని పేర్కొన్నారు. 

వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్‌‌‌‌‌‌‌‌ను గతేడాది ఆగస్ట్ 23న బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. 14 నెలల తర్వాత దాన్ని ఎత్తివేసింది. ఆ తర్వాతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి లిస్టును ప్రకటించింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ పోటీ చేస్తున్నట్లు పేర్కొంది. రాజాసింగ్‌‌‌‌‌‌‌‌పై సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ను ఎత్తివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, పార్టీ నేతలు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

గోషామహల్ నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు స్వయంగా బుల్లెట్ నడుపుతూ ర్యాలీగా పార్టీ ఆఫీసుకు రాజాసింగ్ చేరుకున్నారు. తనపై సస్సెన్షన్ ఎత్తివేసినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్, పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, మురళీధర్ రావులకు రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు.