- ఉర్దూ పత్రిక జర్నలిస్టు కేసులో హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన ఉర్దూ పత్రిక జర్నలిస్టు అక్రమ్ అలీ మహ్మద్ పాస్‌పోర్టు రెన్యువల్‌కు అధికారులు నిరాకరించడాన్ని హైకోర్టు సమర్థించింది. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు అధికారులు పాస్‌పోర్టును రద్దు చేయవచ్చునని స్పష్టం చేసింది. దేశ భద్రత వ్యవహారాల ముందు సహజ న్యాయసూత్రాలతో ఉపశమనం పొందలేరని చెప్పింది. పాస్‌పోర్టు పొందడం హక్కు ఏమీ కాదని కూడా తేల్చి చెప్పింది.
పాస్‌పోర్టు రెన్యువల్‌పై అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఇంటెలిజెన్స్ అధికారుల లేఖ మేరకు పాస్‌పోర్టును రద్దు చేశామని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అథారిటీ పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ ఒక జర్నలిస్ట్ వేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ నగేశ్ భీమపాక విచారించారు.
ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ చర్యలు దేశ సార్వభౌమత్వం, సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం నుంచి రహస్య లేఖ అందిందన్నారు. పిటిషనర్ కు ఐఎస్‌ఐ కార్యకర్తలతో సంబంధం కూడా ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. జాతీయ భద్రతను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున పాస్‌పోర్టు రద్దు చట్టబద్ధమేనంటూ పిటిషన్‌ను కొట్టివేశారు.
