జైపూర్ (భీమారం), వెలుగు: కులాంతర వివాహం చేసుకోవడంతో అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామంలో కలకలం రేపింది. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. దాంపూర్ గ్రామంలోని వేర్వేరు కులాలకు చెందిన చెరుకు అంజలి, సులేమాన్ కొంతకాలంగా ప్రేమించుకుని శుక్రవారం కరీంనగర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన అంజలి తండ్రి లక్ష్మణ్, సోదరులు అంజి, సంపత్ ఆగ్రహానికి గురయ్యారు. పెట్రోల్, గొడ్డళ్లతో సులేమాన్ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి ఫర్నిచర్, ఇతర సామగ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తినష్టం జరిగింది. యువకుడి తండ్రి జంగపల్లి పెద్ద పోషం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
