- నేను పాలిచ్చే ఆవును: జగ్గారెడ్డి
సంగారెడ్డి, వెలుగు: తాను ఎమ్మెల్యేగా లేకున్నా పనులు చేయిస్తున్నానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని గంజిమైదాన్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒక్కో వార్డుకు రూ.8 కోట్ల చొప్పున మొత్తం రూ.300 కోట్లతో పట్టణ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను రోజూ పాలిచ్చే ఆవు లాంటివాడినని, తాను కావాలో, ఐదేళ్లకోసారి పాలిచ్చే ఆవు కావాలో.. తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.
గతంలో 5,500 మందికి ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లు ఇచ్చామని, స్థలాలు లేని వారికి 80 గజాల చొప్పున ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో మాట్లాడినట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థులు పాల్గొన్నారు.
