- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన
- 71 మంది సిట్టింగులకు టికెట్.. ముగ్గురికి నో
- జాబితాలో దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీజయ చవాన్ తదితరులు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 99 మందితో ఆదివారం ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో 13 మంది మహిళలకు అవకాశం ఇవ్వగా.. ఎస్టీల నుంచి ఆరుగురికి, ఎస్సీల నుంచి నలుగురికి సీట్లు ఇచ్చింది. 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ ఇవ్వగా, మూడుచోట్ల సిట్టింగ్ లను మార్చింది. ఫస్ట్ లిస్టులో పలువురు మంత్రులు, ప్రముఖ నేతలకు చోటు దక్కింది.
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్ వెస్ట్ నుంచి, బీజేపీ స్టేట్ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే (కామ్టీ), మంత్రి సుధీర్ ముంగంటివార్ (బల్లార్ పూర్), కేంద్రమంత్రి రావ్ సాహెబ్ దాన్వే కొడుకు సంతోష్ (భోకర్దాన్), మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కూతురు శ్రీజయ చవాన్ (భోకర్), బీజేపీ ముంబై చీఫ్ ఆశీష్ షెలార్ (బాంద్రా), కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే కొడుకు నితీశ్ రాణే కంకవలీ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు ఉండగా 160 సీట్లలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. మిగతా సీట్లలో మిత్రపక్షాలైన శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ వర్గం) పోటీ చేస్తాయి.
అసెంబ్లీ బరిలో మరాఠా అభ్యర్థులు..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠా అభ్యర్థులను నిలబెడతానని మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారుడు మనోజ్ జరంగే ప్రకటించారు. ఆదివారం జాల్నా జిల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరాఠాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మరాఠా అభ్యర్థులను నిలబెడతానని మనోజ్ జరంగే తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లో మరాఠా రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చే అభ్యర్థులకు సపోర్టు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆ అభ్యర్థులు రాసిస్తేనే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకునే మరాఠాలు అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ నెల 29న అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు.
ఎంవీఏలో తేలని సీట్ల పంచాది..
మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో సీట్ల పంపకాల పంచాది ఇంకా తేలలేదు. విదర్భలోని 12 సీట్ల కోసం అటు శివసేన (యూబీటీ), ఇటు కాంగ్రెస్ పట్టుబడుతున్నాయి. దీంతో పరిష్కారం కోసం రెండు పార్టీలూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను ఆశ్రయించాయి. శివసేన (యూబీటీ) లీడర్లు అనిల్ పరబ్, ఆదిత్య థాక్రే ముంబైలో శరద్ పవార్ తో సమావేశమయ్యారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా పవార్ తో టచ్ లో ఉన్నారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) తన రామ్ టెక్, అమరావతి సీట్లను కాంగ్రెస్ కు ఇచ్చింది. ఈసారి తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్న శివసేన (యూబీటీ).. విదర్భలోని 12 సీట్లను తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నది. ఆ ప్రాంతంలో కూటమి నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని వాదిస్తున్నది. దీనికి కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. అంతేకాకుండా నాసిక్ వెస్ట్ సీటుపైనా రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.