ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి బీజేపీ దూరం .. అసెంబ్లీ వద్ద నిరసన

ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి బీజేపీ దూరం .. అసెంబ్లీ వద్ద నిరసన
  • సీనియర్లను కాదని మజ్లిస్ ఎమ్మెల్యేకుప్రొటెం స్పీకర్ ఇచ్చారని బాయ్ కాట్
  • సీనియర్లను కాదని మజ్లిస్ ఎమ్మెల్యేకు ప్రొటెం స్పీకర్ ఇచ్చారని బాయ్ కాట్  
  • గవర్నర్ కు ఫిర్యాదు
  • స్పీకర్ నియామకం తర్వాతే మా ఎమ్మెల్యేల ప్రమాణం: కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బీజేపీ బహిష్కరించింది. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ పార్టీకి చెందిన అక్బరుద్దీన్​ను నియమించారని ప్రోగ్రామ్​ను బాయ్ కాట్ చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం బీజేపీ ఎల్పీ మీటింగ్ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన మూడ్రోజుల్లోనే కాంగ్రెస్, మజ్లిస్ ఒక్కటేనన్న విషయం బయటపడిందని ఆయన అన్నారు.

ఈ రెండు పార్టీల​మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. అందుకే సీనియర్​ఎమ్మెల్యేలను కాదని మజ్లిస్​ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ చేశారు. ప్రొటెం స్పీకర్​గా సీనియర్ ఎమ్మెల్యేలను నియమించుకునే సంప్రదాయం ఉంది. అయితే కాంగ్రెస్​కు అసెంబ్లీలో బొటాబొటీ మెజార్టీ ఉంది. తుమ్మినా, దగ్గినా తమ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందోనన్న భయం కాంగ్రెస్​లో ఉంది. అందుకే మజ్లిస్​మద్దతు కోసం ఆ పార్టీకి ప్రొటెం స్పీకర్​గా అవకాశం ఇచ్చింది” అని మండిపడ్డారు. రెగ్యులర్ స్పీకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని తెలిపారు. 

బీజేపీఎల్పీ మీటింగ్​లో భిన్నాభిప్రాయాలు..  

కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేఎల్పీ మీటింగ్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మజ్లిస్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్​గా నియమించడంతో ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్ణయించారు. తనతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రమాణం చేయరని శుక్రవారమే ప్రకటించారు. అయితే తమతో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటావని రాజాసింగ్​ను కొందరు మీటింగ్ లో ప్రశ్నించినట్టు తెలిసింది.

అలా బహిష్కరించడం సరికాదని, ప్రమాణం చేయాల్సిందేనని కొందరు అన్నట్టు సమాచారం. దీంతో నొచ్చుకున్న రాజాసింగ్ ఆగ్రహంగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదంతా బీజేపీ హైకమాండ్​కు కిషన్ రెడ్డి చెప్పారు. రాజాసింగ్ అభిప్రాయంతో ఏకీభవించిన హైకమాండ్.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాలని ఆదేశించింది. అయితే ఈ విషయాన్ని చెప్పేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నించగా రాజాసింగ్ అందుబాటులోకి రాలేదు. కాగా, రూల్స్ కు విరుద్ధంగా ప్రొటెం స్పీకర్​ను నియమించారని గవర్నర్​కు బీజేపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో ఏడుగురు ఎమ్మెల్యేలే రాజ్ భవన్​కు వెళ్లి గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్ కు మెమొరాండం ఇచ్చారు. 

అసెంబ్లీ వద్ద నిరసన.. 

బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చారు. అక్కడ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ గేట్ నంబర్​2 వద్దకు వచ్చి నిరసనకు దిగారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బీజేపీ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి పంపించివేశారు. కాగా, బీజేపీ ఎల్పీ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.