నేనిప్పుడు సేఫ్‌‌గానే ఉన్నా: సింధు.. ఆల్‌‌ ఇంగ్లండ్‌‌ టోర్నీ కోసం వెళ్తూ దుబాయ్‌‌లో స్ట్రక్‌‌

నేనిప్పుడు సేఫ్‌‌గానే ఉన్నా: సింధు.. ఆల్‌‌ ఇంగ్లండ్‌‌ టోర్నీ కోసం వెళ్తూ దుబాయ్‌‌లో స్ట్రక్‌‌
  • ఆల్‌‌ ఇంగ్లండ్‌‌ టోర్నీ కోసం వెళ్తూ దుబాయ్‌‌లో స్ట్రక్‌‌
  • బాంబు దాడి నుంచి కొద్దిలో తప్పించుకున్న కోచ్‌‌ ప్రతామ

దుబాయ్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌‌షిప్‌‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌‌హామ్ వెళ్తున్న ఇండియా స్టార్ షట్లర్ పీవీ  సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఇరాన్-–ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధం కారణంగా ఆమె దుబాయ్‌‌లో చిక్కుకుపోయింది. దుబాయ్‌‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లు జరిగిన సమయంలో తన కోచ్ ఇర్వాన్శ్య ఆది ప్రతామతో కలిసి అక్కడే ఉన్న సింధు చాలా భయానక పరిస్థితిని ఎదుర్కొన్నామని తెలిపింది. దుబాయ్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ అధికారులు, ఇండియన్‌‌ హై కమిషన్‌‌ అధికారులు తమను సేఫ్‌‌ ప్లేస్‌‌కు షిఫ్ట్ చేశారని వెల్లడించింది. అయితే, విమానసేవలు పూర్తిగా నిలిపివేసిన నేపథ్యంలో మంగళవారం మొదలయ్యే ఆల్‌‌ ఇంగ్లండ్ టోర్నీలో సింధు పాల్గొనడం అనుమానంగా మారింది.

‘మా ఫ్లైట్‌‌ దుబాయ్‌‌లో ల్యాండ్ అవగానే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కొద్దిసేపటికే ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ను మూసివేశారు. మేం అక్కడ ఉన్న సమయంలోనే మాకు అతి సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. నా కోచ్ ఆ పొగ, శిథిలాలకు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి పరుగులు తీయాల్సి వచ్చింది. ఆ క్షణాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆకాశంలో మిస్సైల్స్‌‌ను అడ్డుకుంటున్న శబ్దాలు మాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

ఎయిర్‌‌‌‌పోర్ట్ సిబ్బంది, దుబాయ్ అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మేమిప్పుడు సేఫ్‌‌గా ఉన్నాం’ అని పీవీ సింధు ఎక్స్‌‌లో పోస్ట్ చేసింది. కాగా,  ఇరాన్ ప్రతిదాడులతో గల్ఫ్‌‌ దేశాల్లో  ఉద్రిక్తతలు పెరగడంతో దుబాయ్ ఎయిర్‌‌‌‌పోర్ట్ తన కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ సమీపంలో  మిస్సైల్ దాడి నుంచి కొద్దిలో తప్పించుకున్నానని ఇండోనేసియాకు చెందిన కోచ్ ఇర్వాన్శ్య తెలిపాడు.

ఉన్నతి, విమల్‌‌ విమానాలు రద్దు
ఆల్‌‌ ఇంగ్లండ్ టోర్నీలో పాల్గొనే ఇండియా షట్లర్లలో సాత్విక్ సాయిరాజ్,- చిరాగ్ శెట్టి, లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి,  పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ ఇప్పటికే బర్మింగ్‌‌హామ్ చేరుకున్నారు. యువ ప్లేయర్ ఉన్నతి హుడా వెళ్లాల్సిన విమానం రద్దు కావడంతో ఆమె ఇండియాలోనే ఉండిపోయింది. కోచ్ విమల్ కుమార్ ఫ్లయిట్‌‌ కూడా బెంగళూరులో రద్దయింది. 

డబుల్స్ కోచ్ సుమీత్ రెడ్డి, మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌ ప్లేయర్లు రోహన్‌‌ కపూర్‌‌‌‌, రుత్వికా శివాని తదితరులను సింగపూర్ మీదుగా బర్మింగ్‌‌హామ్‌‌ పంపేందుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్‌‌) ప్రయత్నిస్తోంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితులను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్​) నిశితంగా గమనిస్తోంది. ప్లేయర్ల భద్రత తమకు ముఖ్యమని, విమానాల రద్దు కారణంగా ఆలస్యంగా వచ్చే షట్లర్ల కోసం మ్యాచ్ షెడ్యూల్‌‌లో మార్పులు చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.