న్యూఢిల్లీ: టాటా, మారుతి, మహీంద్రా, హ్యుందాయ్ వంటి టాప్ ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు కిందటి నెలలో భారీగా పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, యుటిలిటీ వెహికిల్స్, ట్రాక్టర్లు, ఎగుమతులు.. అన్ని విభాగాల్లో డిమాండ్ పెరుగుదల కనిపించింది.
* ఈ ఏడాది ఫిబ్రవరిలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ మొత్తం అమ్మకాలు ఏడాది లెక్కన 35శాతం పెరిగి 63,331 యూనిట్లకు చేరాయి. ఇందులో దేశీయ అమ్మకాలు 62,329 యూనిట్లు కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో 1,002 బండ్లను కంపెనీ విక్రయించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 57శాతం వృద్ధి చెంది 8,385 బండ్లకు పెరిగాయి.
* మారుతి సుజుకి మొత్తం అమ్మకాలు 7.32శాతం పెరిగి 2,13,995 యూనిట్లుగా రికార్డయ్యాయి. దేశీయ ప్యాసింజర్ వెహికిల్ అమ్మకాలు 1,61,000 యూనిట్లుగా స్థిరంగా ఉండగా, ఆల్టో, ఎస్–ప్రెస్సో వంటి మినీ కార్ల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. అయితే బాలెనో, సెలెరియో వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు తగ్గి 66,386 బండ్లకు చేరాయి. బ్రెజ్జా, ఎర్టిగా వంటి యుటిలిటీ వెహికిల్స్ అమ్మకాలు 72,756 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతులు 39,155 యూనిట్లుగా నమోదయ్యాయి.
* ఫిబ్రవరిలో కంపెనీ అమ్మకాలు ఏడాది లెక్కన 18శాతం వృద్ధి చెంది 97,177 యూనిట్లకు చేరాయని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. యుటిలిటీ వెహికిల్స్ అమ్మకాలు 19శాతం పెరిగి 60,018 యూనిట్లుగా, కమర్షియల్ వెహికిల్స్ అమ్మకాలు 24,585 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు 11శాతం వృద్ధి చెంది 3,384 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ అమ్మకాలు 34శాతం పెరిగి 34,133 యూనిట్లకు చేరగా, దేశీయంగా 32,153 యూనిట్లు విక్రయించామని కంపెనీ తెలిపింది. ఎగుమతులు 1,980 యూనిట్లుగా ఉన్నాయి.
* హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు 12.6శాతం పెరిగి 66,134 యూనిట్లకు చేరాయి. దేశీయ అమ్మకాలు 52,407 యూనిట్లుగా, ఎగుమతులు 13,727 యూనిట్లుగా ఉన్నాయి.
