‘ఉద్యమాల పల్లె’ ప్రస్థానం ముగిసింది..! ముప్పిడి సాంబయ్య లొంగుబాటుతో ముగిసిన శకం

‘ఉద్యమాల పల్లె’ ప్రస్థానం ముగిసింది..! ముప్పిడి సాంబయ్య లొంగుబాటుతో ముగిసిన శకం
  • చిన్నవయసులోనే ఉద్యమాల బాటపట్టిన కాజీపేట మండలం తరాలపల్లివాసులు
  • దశాబ్ధాల తరబడి దళంలో కీలకంగా సేవలు
  • గతంలోనే ఏడుగురు ఎన్ కౌంటర్ లో మృతి
  • ఆపరేషన్ కగార్ లో గతేడాది అంకేశ్వరపు సారయ్య హతం

హనుమకొండ, వెలుగు: మావోయిస్టు ఉద్యమాల్లో హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి ప్రస్థానం ముగిసింది. గ్రామం నుంచి విప్లవోద్యమాల బాట పట్టి దళ సభ్యుడి నుంచి కీలక పదవులకు ఎదిగిన నేతలంతా ఒక్కొక్కరిగా ఎన్ కౌంటర్లకు బలవగా, తరాలపల్లి నుంచి మావోయిస్టు పార్టీలో మిగిలిన ఒకే ఒక్క నేత ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ అలియాస్ ప్రభాకర్ ఇప్పుడు దళం నుంచి బయటకొచ్చారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో సాంబయ్య ఆదివారం ఛత్తీస్ గడ్ పోలీసుల ఎదుట లొంగిపోగా, మావోయిస్టు ఉద్యమాల్లో తరాలపల్లి శకానికి ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది. 

ఉద్యమాల పల్లెగా తరాలపల్లి..

హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధి తరాలపల్లికి ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరుంది. గ్రామానికి చెందిన ఎంతోమంది విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు ఆకర్షితులై అడవుల బాట పట్టారు. అజ్ఞాతంలోకి వెళ్లినప్పటి నుంచి దశాబ్ధాల తరబడి దళానికి సేవలందించారు. దళ సభ్యుడిగా చేరి, దండకారణ్యంలో వివిధ జోన్లలో కీలక పదవులు చేపట్టారు. దీంతో తరాలపల్లికి ఉద్యమాల పల్లెగా పేరొచ్చింది. ఇదిలాఉంటే తరాలపల్లి నుంచి ఎంతోమంది ఉద్యమాల బాట పట్టినా, కొంతమంది లొంగుబాటును ఎంచుకున్నారు.

కొంతమంది మావోయిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి దళంలోనే కొనసాగారు. ఈ క్రమంలోనే వివిధ సందర్భాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 1991లో జరిగిన ఎన్ కౌంటర్ లో వేల్పుల జగదీశ్ అలియాస్ ఉప్పలన్న, 1992లో బండి ఆశాలు అలియాస్ శ్రీను హతమయ్యారు. ఆ తర్వాత కాలంలో గాజుల శ్రీనాథ్ అలియాస్ శ్రీకాంత్, ముప్పిడి నాగేశ్వరరావు అలియాస్ విశ్వనాథ్, చిర్ర సదానందం అలియాస్ కౌముదీ, పేరాల సంపత్ కుమార్, కొత్తపల్లి సాంబయ్య అలియాస్ ఉప్పలన్న ఎన్ కౌంటర్ లో ప్రాణాలు వదిలారు.

సారయ్య హతం.. సాంబయ్య లొంగుబాటు

తరాలపల్లి నుంచి కీలక బాధ్యతలు స్వీకరించిన తొమ్మిది మందిలో ఏడుగురు ఇదివరకే ప్రాణాలు కోల్పోగా, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావంతో మిగతా ఇద్దరూ దళానికి దూరమయ్యారు. గతేడాది మార్చి 25న బీజాపూర్-దంతేవాడ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్ ప్రాణాలు కోల్పోయారు. 1982లో పదో తరగతి చదువుతున్న సమయంలోనే అంకేశ్వరపు సారయ్య, ముప్పిడి సాంబయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. కాగా, ఆపరేషన్ కగార్ లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో అంకేశ్వరపు సారయ్య చనిపోయారు. దీంతో గ్రామానికి చెందిన తొమ్మిది మందిలో ముప్పిడి సాంబయ్య మాత్రమే దళంలో మిగిలిపోయారు. ఈ క్రమంలోనే ముప్పిడి సాంబయ్య కూడా ఆదివారం లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమంలో తరాలపల్లికి ప్రస్థానం ముగిసినట్లయ్యింది.

45 ఏండ్ల ఉద్యమ జీవితం..

ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్, ప్రభాకర్ తరాలపల్లి నుంచి 1982లోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ రామస్వామి-భద్రమ్మ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. అందులో పెద్దవాడు ముప్పిడి సదానందం, ఆ తర్వాత ముప్పిడి సాంబయ్య, ముప్పిడి నాగేశ్వరరావు, ఇద్దరు ఆడబిడ్డలు జ్యోతి, సంధ్య ఉన్నారు. పెద్దవాడైన ముప్పిడి సదానందం రిటైర్డ్ టీచర్ కాగా, రెండో సంతానం ముప్పిడి సాంబయ్య 1982లో దళంలో చేరాడు. మూడో సంతానం ముప్పిడి నాగేశ్వరావు అలియాస్ విశ్వనాథ్ కూడా విప్లవాల బాట పట్టారు. నాగేశ్వరరావు 1998లో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోగా, సాంబయ్య ఇంతకాలం ఉద్యమాల్లోనే కొనసాగారు. ఈ క్రమంలోనే ఆదివారం చత్తీస్ గడ్ పోలీసుల ఎదుట ఆయన లొంగిపోవడంతో 45 ఏండ్ల సాంబయ్య ఉద్యమ ప్రస్థానానికి తెరపడినట్లయ్యింది.